మేడ్చల్, నవంబర్ 19 : విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలను విద్యార్థులు వినియోగించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మేడ్చల్‌లోని జిల్లా గ్రంథాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి హాజరయ్యారు. ఈసందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ..చాలా మంది విద్యార్థులకు గ్రంథాలయం ప్రాముఖ్యత తెలియడం లేదని, 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు గ్రంథాలయాలను వినియోగించుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఇందుకోసం వారానికి ఒక పీరియడ్ కేటాయించాలన్నారు. ప్రతి పాఠశాల గ్రంథాలయాన్ని వినియోగించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన డీఈవోను కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి మాట్లాడుతూ..జిల్లాలోని పలు పాఠశాలల్లో గ్రంథాలయాలను నిర్వహిస్తున్నామని, విద్యార్థులు వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అనంతరం అత్వెల్లి ప్రాథమిక పాఠశాలలో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన డ్రాయింగ్, వ్యాసరచన పోటీలను డీఈవో విజయకుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్‌రెడ్డి సందర్శించారు. కార్యక్రమంలో నాయకులు చింతల నర్సింహారెడ్డి, కటపాక కుమార్, అత్వెల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాల హెచ్ఎంలు రామారావు, రాజిరెడ్డి పాల్గొన్నారు.