బంజారాహిల్స్, నవంబర్ 19 : కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీ-ఫారమ్స్ అమ్ముకున్న నీచమైన చరిత్ర ఎంపీ ధర్మపురి అరవింద్దని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసానికి వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మేయర్ బొంతు రాంమోహన్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి తదితరులు ఆమెకు సంఘీభావం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు యావత్తు మహిళలను కించపర్చే విధంగా ఉన్నాయని అన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ తన తండ్రి డీ.శ్రీనివాస్ పీసీసీగా ఉన్న సమయంలో బీ-ఫారమ్స్ అమ్ముకున్నారని, ఈ విషయానికి తానే ప్రత్యక్ష సాక్షి అని పేర్కొన్నారు. మాజీ మేయర్ బొంతు రాంమోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో తాము హింసకు దూరంగా ఉన్నామని, ధర్మపురి అరవింద్ ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకుంటే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.