చిక్కడపల్లి, నవంబర్ 19 : ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్తో పాటు దేశంలోని అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఛత్తీస్గఢ్ రాష్ట్ర వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖ మంత్రి కొవాసి లకుమా అన్నారు. భారత జాతీయ స్వాతంత్రోద్యమ ఆకాంక్షల సాధన కోసం భారత్ బచావో పేరిట శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మేథోమదన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కొవాసి లకుమా మాట్లాడతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలేదని మండిపడ్డారు. అంబానీ, అదానీలకు లాభం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వ పాలన కొసాగుతుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోందని ధ్వజమెత్తారారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం భారత దేశ మౌలిక విలువలను దెబ్బతీస్తోందని అన్నారు. ఈ సమావేశంలో బీఏఎంసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు వామన్ మేష్రం, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ, ప్రొఫెసర్ పీఎల్.విశ్వేశ్వర రావు, ప్రొఫెసర్ తిరుమలి, ప్రొఫెసర్ సురపల్లి సుజాత, భారత్ బచావో ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.