అమీర్‌పేట్, నవంబర్ 19: సమాజంలో మనం ఎలా ఉండాలి, ఎటువంటి స్ఫూర్తిని కలిగి ఉండాలనే విషయాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు రచించిన ‘బ్రేకింగ్ బారియర్స్’ చదివితే మనకు తెలుస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఎమెస్కో విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో బేగంపేట్‌లోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు తన స్వీయ రచన ‘బ్రేకింగ్ బారియర్స్’.. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ దళిత్ చీఫ్ సెక్రటరీ.. (అన్ డివైడెడ్ ఎ.పి) పుస్తకావిష్కరణ సభ శనివారం జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ వై.వి.రెడ్డి చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ వై.వి.రెడ్డి మాట్లాడుతూ… ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో కచ్చితత్వంతో వ్యవహరించే వ్యక్తిగా నిరుపేదలకు ఆప్తుడైన వ్యక్తి కాకి మాధవరావు అని అన్నారు. అనంతరం పుస్తక రచయిత కాకి మాధవరావు తన అనుభవాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వేణుగోపాల్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భాస్కర్‌రావు, ఎస్వీ విశ్వవిద్యాలయ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కె.ఇనాక్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, విక్రమ్, గోగు శ్యామల తదితరులు ప్రసంగించారు.