ఉప్పల్, నవంబర్ 19: అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఉప్పల్‌లోని చిలుకానగర్ డివిజన్లో రూ.2 కోట్ల 80 లక్షల నిధులతో చేపట్టిన పనులకు మంత్రి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డి, కార్పొరేటర్ గీతాప్రవీణ్ ముదిరాజ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు స్టార్మ్ వాటర్, వీడీసీసీ రోడ్ల అభివృద్ధికి రూ.2 వేల కోట్ల వ్యయంతో పనులు జరుగుతున్నాయన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. గ్రేటర్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువ నిధులు కేటాయించినట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. సిగ్నల్ రహిత రవాణ వ్యవస్థ కోసం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజ, ఎస్ఈ అశోక్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, ఈఈ నాగేందర్, నేతలు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, కొండల్‌రెడ్డి, జగన్, వీబీ.నరసింహ, జగన్, శేఖర్, అబ్బుబాయ్, పాల్గొన్నారు.