జీడిమెట్ల, నవంబర్19: జీఎస్టీ అధికారులమని చెప్పి అమాయకులను నమ్మించి రూ.20 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన ఇద్దరు నిందితులను బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం షాపూర్‌నగర్‌లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో డీసీపీ సందీప్ గోనె నిందితుల వివరాలు వెల్లడించారు. బోడుప్పల్‌కు చెందిన నారాయణగౌడ్(56), కాప్రాకు చెందిన శైలజ(37) జీఎస్టీ అధికారులుగా చెప్పుకుంటూ పలువురిని మోసం చేశారు. నారాయణగౌడ్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్‌గా, శైలజ జీఎస్టీ డిప్యూటీ కమిషనర్‌గా పేర్కొంటూ పలువురు వ్యాపారులను కలిసి జీఎస్టీ లేకుండా లిక్కర్, సిమెంట్, ఐరన్లలో పెట్టుబడులు పెట్టాలని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించవచ్చని నమ్మబలికి రూ.20 కోట్ల వరకు వసూలు చేశారు. అలాగే కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన బంగారం తక్కువ ధరకు వస్తోందని పలువురి దగ్గర డబ్బులు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్నారు. వీరిపై పేట్‌బషీరాబాద్, దుండిగల్, ఎల్బీనగర్, ఉప్పల్, మీర్పేట్, నర్సాపూర్, కరీంనగర్ పీఎస్‌ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బాలానగర్ డీసీపీ సందీప్, అడిషనల్ డీసీపీ నారాయణ పర్యవేక్షణలో బాలానగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ జేమ్స్‌బాబు నేతృత్వంలో నారాయణగౌడ్, శైలజలను వలపన్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి ఒక కారు, హోండా యాక్టీవా, మూడు సెల్ఫోన్లు, నాలుగు రిజిస్టర్ డాక్యుమెంట్లు, వివిధ జ్యూవెలరీ దుకాణాల్లో కొనుగోలు చేసిన నగల రశీదులు, 7 ఏటీఎం కార్డులు, 20వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.