సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): చిన్నారులు, విద్యార్థులపై ఇటీవల జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని బాలల రక్షణ కోసం ‘బాలమిత్ర’ను పునః ప్రారంభిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. శనివారం గచ్చిబౌలి, శాంతిసరోవర్‌లోని బ్రహ్మకుమారీస్ ఆడిటోరియంలో పలువురు పోలీసు అధికారులతో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి బాలమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలమిత్ర పుస్తకంతో పాటు లోగో, బ్రోచర్లను ఆవిష్కరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ… ప్రభుత్వం షీ టీమ్‌లు ఏర్పాటు చేసి మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేసిందన్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో పెట్టుకుని బాలమిత్ర కార్యక్రమాన్ని పునః ప్రారంభించినట్లు తెలిపారు. చాలా మంది తల్లిదండ్రులు జరిగిన అఘాయిత్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకు వస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడమే కాకుండా చట్ట ప్రకారం తప్పుచేసిన వారికి తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తాం..
బాల మిత్రుల ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పిల్లల పట్ల తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రవర్తించాల్సిన తీరుపై అవగాహన కల్పిస్తామని సీపీ వివరించారు. బాలలపై జరుగుతున్న లైంగిక దాడులకు అడ్డుకట్ట వేసేందుకు పోక్సో చట్టంపై విస్తృతమైన అవగాహన తీసుకురావడం, మంచి, చెడుల గూర్చి పిల్లలకు వివరిస్తూ వారిలో చైతన్యం తీసుకువస్తామన్నారు. దీంతో పాటు పాఠశాలల్లో బాలమిత్ర గూర్చి ప్రచారం చేయిస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ప్రతి పాఠశాలలో ఒక ఉద్యోగిని కౌన్సిలర్‌గా ఎంపిక చేసి షీ-టీమ్‌కు, విద్యార్థులకు మధ్య వారధిగా ఉండేలా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ప్రివెంట్, ప్రొటెక్ట్, ప్రాసిక్యూట్, రిపోర్ట్, రిడ్రెస్సెల్, రిహాబిలిటేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ, సెల్ఫ్ ఎస్టీమ్‌ను ప్రాతిపదికగా తీసుకున్నామని, బాలమిత్రలో టీచర్లతే ప్రధాన భూమిక అని సీపీ వివరించారు. పాఠశాలల యాజమాన్యాలు కచ్చితంగా సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానితుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత, డీసీపీలు శిల్పవల్లి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.