సిటీబ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): దుర్గం చెరువులో తెలంగాణ ప్రభుత్వం వాటర్ స్కూల్‌ను ఏర్పాటు చేసి జలక్రీడలకు సంబంధించిన శిక్షణను ఇప్పిస్తోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌లు సంయుక్తంగా సెయిలింగ్, కయాకింగ్, విండ్ సర్ఫింగ్, స్టాండప్ ప్యాడ్లింగ్లో నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు. నేషనల్, ఏషియన్, ఒలింపిక్స్ స్థాయిలో రాణించేలా తర్ఫీదునిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ శిక్షణకు ఔత్సాహికుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. పిల్లలతోపాటు పెద్దలు ఉత్సాహంగా శిక్షణను పొందుతున్నారు. నగరంలో గతంలో బాగా ప్రజాదరణ పొందిన కయాకథాన్, హైడ్రథాన్ ఈవెంట్స్‌ను రాబోయే రోజుల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. లైఫ్ సేవింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం సైతం అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కయాకింగ్‌లో శిక్షణకు ఒకో సెషన్‌కు రూ. 1,400, ఐదు సెషన్స్‌కు రుసుము రూ. 5,600గా నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. సర్ఫింగ్, స్టాండప్ ప్యాడ్లింగ్కు ఇదే రుసుమును నిర్ణయించామని, సెయిలింగ్‌లో 12 సెషన్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు రూ.9,500 ఫీజు ఉంటుందని తెలిపారు.