సైదాబాద్, నవంబర్ 11: జువైనల్ హోమ్‌కు వచ్చే చిన్నారుల్లో మార్పులు తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే ఎక్కడాలేని విధంగా సైదాబాద్ జువైనల్ హోమ్ డిపార్టుమెంట్ కార్యాలయం ఆవరణలో రూ.13 లక్షల వ్యయంతో ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే చిన్నారులకు అనేక అంశాల్లో శిక్షణనిచ్చి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న జువైనల్ అధికారులు ఇప్పుడు ఆర్చరీలో సైతం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్చరీలో జాతీయ స్థాయిలో చాంపియన్‌గా నిలిచిన కోచ్ హేమలత చిన్నారులకు శిక్షణ ఇస్తుండగా.. ఈ ఆర్చరీ కేంద్రాన్ని షాట్స్ అధికారులు, రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి సీహెచ్‌కే భూపతి, జిల్లా అడిషనల్ జడ్జి ఆర్.తిరుపతి, డీఎల్ఎస్ఏ సెక్రటరీ శ్రీదేవి, జేజేబీ మెజిస్ట్రేట్ ఎం.ఉషశ్రీ సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఈ ఆర్చరీ కేంద్రాన్ని త్వరలోనే రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారు.
ఆర్చరీలో శిక్షణ వీరికే…
సైదాబాద్ ప్రభుత్వ బాలుర సదనం చిన్నారులకు, నింబోలిఅడ్డ బాలికల సదనం, విడుదలైన వారికి ఇక్కడ ఆర్చరీలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కేంద్రంలో 20మంది శిక్షణ పొందనుండగా అందులో బాలికల సదనం నుంచి 8మంది, బాలుర సదనం నుంచి 8మంది ఉంటారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు బాలురకు, సాయంత్రం 3:30 నుంచి 5 :30 గంటల వరకు బాలికలకు ప్రతి రోజు రెండు గంటలపాటు శిక్షణ ఇస్తారు.