సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ధనుర్వాతం, డిప్తీరియా నిర్మూలన వ్యాక్సిన్ను జిల్లాలోని పిల్లలందరికీ వేయించాలని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మీజిల్స్ అండ్ రెబెల్లా నిర్మూలనపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మాట్లాడుతూ టీడీ వ్యాక్సిన్ను పాఠశాలల్లో 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసున్న పిల్లలకు తప్పకుండా ఇప్పించాలని సూచించారు.
ఈ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 19 వరకు నిర్వహించాలన్నారు. పాఠశాలకు రాని పిల్లలను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో టీకా ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్లోని పాతనగరంలో ప్రజలకు దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డా.వెంకటి, సంక్షేమ శాఖ అధికారి అక్కేశ్వరరావు, డీఐవో శ్రీకళ, జిల్లా వైద్యాధికారులు, డిప్యూటీ విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.