సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా ఇంటిని హుక్కా కేంద్రంగా మార్చిన నిర్వాహకుడిని సీసీఎస్ ఈస్ట్‌జోన్ క్రైమ్ టీమ్ అరెస్ట్ చేసింది. అతడి వద్ద నుంచి రూ. 2,03,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ తెలిపారు. హిమాయత్‌నగర్‌లో నివాసముండే ఇఫ్తేకర్ తన ఇంట్లో హుక్కా సెంటర్‌ను నిర్వహిస్తున్నాడనే సమాచారంతో సోమవారం సీసీఎస్ పోలీసులు దాడి చేశారు.
ఆ సమయంలో అక్కడ 13 మంది హుక్కా వినియోగదారులు ఉన్నారు. అందులో 11 మంది మైనర్లు ఉన్నారు. కాలేజీలకు సమీపంలో హుక్కా సెంటర్‌ను నిర్వహించిన నిందితుడు మైనర్లను ఆకర్షిస్తున్నాడని, నిందితుడిని అరెస్టు చేసి నగదుతోపాటు 4 సెల్ఫోన్లు, హుక్కా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు జాయింట్ సీపీ పేర్కొన్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు.