సిటీ బ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): మొబైల్ యాప్ యూజర్ల షాపింగ్‌లో మార్పు వస్తోంది. ఫుడ్ యాప్స్‌లలో గ్రాసరీ బుకింగ్ ఫెసిలిటీ ఉన్నా… పార్శిళ్లకు ప్రాధాన్యతనిచ్చేవారు. కానీ గతేడాది కాలంగా ఆన్లైన్ ఆర్డర్లలో ఫుడ్‌తో సమానంగా నిత్యావసర సరుకులు, ఇంటికి అవసరమైన ఇతర వస్తువులను కూడా ఆర్డర్ చేస్తున్నారు. ఇందులో పాలు, గుడ్లు, పండ్లతోపాటు మహిళలకు అవసరమైన డైపర్లు, కూడా ఉన్నాయి. ఈ తరహా షాపింగ్ ధోరణి అలవాటైందని, దీంతో దాదాపు 16 రెట్లు గ్రాసరీ బుకింగ్ పెరిగాయని, ఫుడ్‌తోపాటు వీటికి ఆదరణ వస్తోందని స్విగ్గీ నివేదికలో పేర్కొంది.
బ్రేక్ ఫాస్ట్‌లో గుడ్డు ఉండాల్సిందే…
2021-22 జూన్ నాటికి స్విగ్గీ డెలివరీల నివేదికను విడుదల చేయగా… దేశవ్యాప్తంగా బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లోనే నిత్యావసర సరుకులు బుకింగ్ ఎక్కువగా ఉన్నట్లుగా తేలింది. ఇందులో ఉదయాన్నే చేసే బ్రేక్ ఫాస్ట్ కోసం గుడ్డు తప్పనిసరిగా మారిందని వెల్లడైంది. స్విగ్గీలో గ్రాసరీ బుకింగ్ మొదలైన రెండేండ్లలో ఏకంగా 50మిలియన్ల గుడ్లను ఒక్క హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చెందిన యూజర్లే కొనుగోలు చేసినట్లుగా తేలింది. వీటితోపాటు 5.6మిలియన్ల ఇన్స్టంట్ నూడిల్స్ ఆర్డర్ చేశారు. కూల్ డ్రింక్స్ విషయంలోనూ భారీగానే ఆర్డర్లు వచ్చాయని, ఒక్క జూన్ నెలలోనే 27వేల పండ్ల రసాలను కొనుగోలు చేసినట్లుగా వెల్లడైంది. అదేవిధంగా గతేడాది కాలంగా స్విగ్గీలో బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాలకు చెందిన యూజర్లు 62వేల టన్నుల పండ్లు, కూరగాయలను కొనుగోలు చేసినట్లుగా తెలిసింది.