మాదాపూర్, నవంబర్ 2: శారీరక, మానసిక ఆరోగ్యానికి నడక,పరుగు ఎంతగానో ఉపయోగపడుతాయని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. మాదాపూర్‌లోని టీ హైవ్, ఈ గ్యాలరీ మాల్లో ఫ్రీడమ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో డిసెంబర్ 11న నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్న 10 కె రన్ కార్యక్రమాన్ని సంబంధించి సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు, ఫ్రీడమ్ హైదరాబాద్ ప్రతినిధులతో కలిసి 10 కె రన్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ .. ప్రతి రోజు రన్నింగ్, వాకింగ్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.
ఫ్రీడమ్ హైదరాబాద్ రన్ ఫౌండేషన్ వారు రన్ ద్వారా సేకరించిన నిధులతో క్రీడలకు, క్రీడాకారులకు మద్దతును అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రీడమ్ హైదరాబాద్ 10 కె, 5 కె రన్లను రెండు విభాగాల్లో నిర్వహిస్తామని 10 కె రన్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్యామ్ తెలిపారు. ప్రవేశ రుసుము నవంబర్ 10వ తేదీ వరకు చెల్లించాలని, 10 కె రన్ కోసం రూ.1000, 5 కె రన్ కోసం రూ. 700 లను చెల్లించాలని ఆయన తెలిపారు. మారథాన్ ఈవెంట్లో పాల్గొనేందుకు www.hyderabad10jrun.com లేదా www.ifinish.in కు లాగిన్ కావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యాక్ట్ ఏజిఎం వాజీద్ అలీ, జెమిని ఎడిబుల్స్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.