సిటీబ్యూరో , అక్టోబరు 31 (నమస్తే తెలంగాణ)/బేగంపేట్: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాల్సిందేనని నేతన్నలు నినదించారు. సోమవారం వివిధ రకాల నినాదాలతో కూడిన ప్లకార్డులను చేతబూని.. నిజాం కళాశాల మైదానం నుంచి అబిడ్స్ జీపీవో వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జీఎస్టీని
ఉపసంహరించకపోతే.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు చేనేత వస్త్రాలు, ముడి సరుకులపై జీఎస్టీ ఎత్తి వేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి తలసాని పోస్ట్ కార్డును పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వ్యాపారం కాదు…. వృత్తి అని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ రంగంపై గతంలో ఎప్పుడు ఎలాంటి పన్ను విధించలేదని చెప్పారు.
చేనేత వృత్తి దారుల్లో అత్యధికంగా నిరుపేదలు ఉన్నారని మంత్రి వివరించారు. సంక్షోభంలో ఉన్న చేనేత రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పూర్వ వైభవం తీసుకొచ్చినట్లు తెలిపారు. చేనేతలను ఆదుకునేలా రాయితీపై ముడి సరుకులు ఇచ్చామన్నారు. చేనేత కళాకారుడి నైపుణ్యం, సృజనాత్మకత పై ఆధారపడి ఈ రంగం మనుగడ సాగిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.