బడంగ్‌పేట, అక్టోబర్ 31 : మీర్‌పేట రోడ్డుకు మహర్దశ రానుంది. జిల్లెలగూడ అంబేద్కర్ చౌరస్తా నుంచి అల్మాస్గౌడ కమాన్ వరకు రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.7 కోట్లు కేటాయించింది. వంద ఫీట్ల రోడ్డు చేయాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగానే మీర్‌పేట టౌన్ ప్లానింగ్ అధికారులు సర్వే చేస్తున్నారు. సర్వే పనులు చివరి దశకు వచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొంత మేరకు రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు. స్థానికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు రోడ్డు విస్తరణ చేయడానికి అధికారులు సర్వే చేయడం జరిగింది. రోడ్డు విస్తరణలో భాగంగా నష్టపోతున్న నిర్వాసితులకు నోటీసులు జారీచేసి వారికి టీడీఆర్ కింద నష్ట పరిహారం చెల్లించడం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రోడ్డు విస్తరణలో ఎంత మంది ఇండ్లు పోతున్నాయన్న అంశాలపై అధికారులు సర్వే చేస్తున్నారు. మంగళవారంతో సర్వే పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వే పూర్తి కాగానే జాబితాను ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. వంద ఫీట్ల వరకు విస్తరణ చేసి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయిస్తారు. డివైడర్ మధ్యలో విద్యుత్ స్తాంభాలు ఏర్పాటు చేసి హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించనున్నారు. సాఫీగా ప్రయాణ సాగే విధంగా రోడ్లను తీర్చిదిద్దనున్నారు.
ట్రాఫిక్ సమస్యకు చెక్
మీర్‌పేట నుంచి అల్మాస్గూడ వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్య పూర్తిగా పోతుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. రోడ్డు ఇరుకుగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుందని స్థానికులు పలుమార్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి రోడ్ల సమస్యను మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీసుకెళ్లి, ప్రభుత్వం నుంచి రూ.7 కోట్లు మంజూరు చేయించారు. దీంతో అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేస్తూనే సర్వే కూడా చేస్తున్నారు.
దశలవారీగా అభివృద్ధి
మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న రోడ్లను దశల వారీగా పూర్తి చేయిస్తాం. ఇటీవల మహేశ్వరం నుంచి తుమ్మలూరు, బడంగ్‌పేట నుంచి నాదర్గుల్, నాదర్గుల్ నుంచి తుర్క యంజాల్, కుర్మల్‌గూడ నుంచి నాదర్గుల్, ఆర్సీఐ రోడ్డు నుంచి పహాడీషరీఫ్ వరకు రోడ్డు విస్తరణకు నిధులు పెద్ద మొత్తంలో ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. మీర్‌పేట, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. ప్రయాణ సౌలభ్యం మెరుగు పర్చడానికి రోడ్ల వేయిస్తున్నాం.
– సబితా ఇంద్రారెడ్డి, మంత్రి