మేడ్చల్, అక్టోబర్31(నమస్తే తెలంగాణ): యాసంగి పంటల సాగు యాక్షన్ ప్లాన్ను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. దీనికి అనుగుణంగా పంటల సాగు చేసేలా రైతులను సన్నద్ధం చేయనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 19,756 ఎకరాల విస్తీర్ణంలో పలు పంటలను సాగును చేయనున్నారు. పంటల సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేలా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. 19,756 ఎకరాల విస్తీర్ణంలో ప్రధానంగా వరి, కూరగాయలు, వాణిజ్య పంటలను సాగు చేసేలా అధికారులు ప్రోత్సహించనున్నారు. వరి, కూరగాయల సాగుతో పాటు గోధుమ, జొన్న, నూనె పంటలు, మొక్కజొన్న తదితర పంటలను సాగు వ్యవసాయశాఖ సాగు చేయించనున్నారు.
విత్తనాలు, ఎరువులు అందుబాటులో..పంటలకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచింది. వరి సాగుకు అవసరమయ్యే విత్తనాలు 4455 మెట్రిక్ టన్నులు, మొక్కజొన్న 2900 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండగా, యూరియా 403 మెట్రిక్ టన్నులు, డీఏపీ, 329, కాంప్లెక్స్ 1429, ఎంఓపీ, 370 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రైతులకు పంటల సాగుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి మేరి రేఖ తెలిపారు. పంటల సాగు పై రైతు వేదికల ద్వారా శిక్షణ తరగతును వచ్చే నెల మొదటి వారం నుంచి నిర్వహించనున్నట్లు వ్యవసాయాధికారి వెల్లడించారు.
పంట విస్తీర్ణం
వరి 13600
కూరగాయలు 2657
వాణిజ్య పంటలు 2088
ఇతర పంటలు 691