సిటీబ్యూరో, అక్టోబరు 31 (నమస్తే తెలంగాణ): ఐటీ కంపెనీల కార్యకలాపాలతో హైదరాబాద్ మహానగరం పడమర దిక్కున శరవేగంగా విస్తరిస్తోంది. దీనికి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ సంస్థ దీనికి సంబంధించి ప్రత్యేకంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందిస్తోంది. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఆకాశ మార్గంలోనే (ఎలివేటెడ్) పిల్లర్లు నిర్మించి దానిపై ఎలక్ట్రికల్ బస్సులను నడిపేలా కొత్తగా ఎలివేటెడ్ బస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టిమ్ (ఈబీఆర్టీఎస్)కు రూపకల్పన చేస్తోంది.
మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం ప్రతి కిలో మీటరుకు రూ.220 కోట్ల వరకు వ్యయం అవుతుండగా, అదే ఈబీఆర్టీఎస్ విధానంలో అయితే దాని వ్యయం రూ.110 నుంచి రూ.120 కోట్ల దాకా అవుతోంది. రైళ్ల మాదిరిగానే ఉండే బస్సు బోగీలు రోడ్డు మీద కాకుండా ఆకాశ మార్గం (ఫ్లై ఓవర్)లో పరుగులు పెట్టేలా ప్రత్యేకంగా పిల్లర్లను నిర్మిస్తూ వాటికి అనుసంధానంగా ట్రాక్‌ను నిర్మించనున్నారు. ఈ ట్రాక్‌కు విద్యుత్ సరఫరా అనుసంధానమై ఉంటుంది. మెట్రో స్టేషన్ మాదిరిగా ఎక్కువ స్థలం అవసరం లేకుండా అతి తక్కువ స్థలంలోనే ప్రయాణికులు వాటిని ఎక్కి, దిగేందుకు వీలుగా నిర్మాణాలు చేపడతారు. ఇలా ఇప్పటి వరకు దేశంలోనే లేనటువంటి అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థను నగరంలో తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మార్గాన్ని నగరానికి వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న ఐటీ కారిడార్‌కు ఇరువైపులా పడమర, తూర్పు ప్రాంతాలతో పాటు పడమర, దక్షిణ ప్రాంతాలను కలుపుతూ సుమారు 28-30 కి.మీ మేర నిర్మించనున్నారు.
ఇప్పటికే కేపీహెచ్‌బీ కాలనీ నుంచి హైటెక్ సిటీ ఎంఎంటీసీ రైల్వే స్టేషన్, హైటెక్స్, మాదాపూర్ సీఐఐ, టెక్ మహీంద్ర, డెల్ కంపెనీల మీదుగా రాయిదుర్గం మెట్రోస్టేషన్ వరకు అక్కడి నుంచి తిరిగి శిల్పా లేఅవుట్ మీదుగా గచ్చిబౌలి డీఎల్ఎఫ్, ట్రిపుల్ ఐటీ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ మీదుగా నిర్మించాలని ఒక ప్రతిపాదన సిద్ధం చేశారు. తాజాగా కోకాపేటలో కొత్తగా హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న కోకాపేట నియోపోలీస్ సెజ్ మీదుగా తీసుకువెళ్లి అక్కడి నుంచి నార్సింగి ఓఆర్ ఆర్కు కలిసేలా నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి తుది ప్రాజెక్టు నివేదికను హైదరాబాద్ మెట్రో అధికారులు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రాయిదుర్గం వరకు ఉన్న మెట్రో రైలు మార్గాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఔటర్ రింగు రోడ్డు వెంబడి నిర్మించాలన్న ప్రతిపాదన ఉండడంతో దాన్ని నార్సింగి వద్ద కలిసేలా ఈబీఆర్టీఎస్ మార్గానికి రూపకల్పన చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును సైతం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలోనే చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది.