సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): పనులు జరుగుతున్న ప్రదేశాల్లో కచ్చితంగా సేఫ్టీ ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని జలమండలి అధికారులను ఎండీ దానకిశోర్ ఆదేశించారు. సోమవారం తార్నాక, లాలాపేట ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పనులు చేస్తున్నప్పుడు కచ్చితంగా సదరు పని వివరాలు తెలిపేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సివరేజీ ముందస్తు నిర్వహణ పనులను సైతం ఆయన పరిశీలించారు. పనులు జరిగే చోట్ల తప్పనిసరిగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని పేరొన్నారు. అనంతరం తార్నాక, లాలాపేటలో మంచినీరు సరఫరా అవుతున్న సమయంలో కాలనీల్లోకి వెళ్లి నీటి సరఫరాను పరిశీలించారు. నీటి నాణ్యతను స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని జలమండలి అధికారులను ఎండీ దానకిశోర్ ఆదేశించారు. నీటి నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, లోప్రెషర్ సమస్యలు లేకుండా చూడాలని పేరొన్నారు. అనంతరం తార్నాకలోని జలమండలి రిజర్వాయర్ ప్రాంగణంలోని క్లోరినేషన్ రూమ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీఎం రమణారెడ్డి, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.