సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌కు 1- 5వ తరగతి వరకు సీబీఎస్సీ బోర్డు అనుమతి ఉన్నప్పటికీ, 6, 7 తరగతులకు అనుమతులు లేవని విద్యాశాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు సీబీఎస్ఈ బోర్డు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నదన్నారు. ఈ విషయమై స్కూల్ యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. బాలికపై జరిగిన లైంగికదాడి ఘటన నేపథ్యంలో ఆ స్కూల్‌ను వెంటనే మూసివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పాఠశాల గేట్లకు తాళాలు వేశారు.
ఈ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల్లో 558 మంది నుంచి విద్యాశాఖ కమిషనర్ అభిప్రాయాలు సేకరించారు. వారిలో 90 శాతం వరకు డీఏవీ స్కూల్‌ను తిరిగి ఓపెన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మిగిలిన వారిలో కొంత మంది స్కూల్ ఫీజులు తిరిగి చెల్లించాలని, ఇంకొంత మంది ఇతర ప్రాంతాల్లో ఉన్న డీఏవీ స్కూళ్లలో తమ పిల్లలను సర్దుబాటుచేయాలని, చుట్టుపక్కల ఉండే సీబీఎస్ఈ స్కూళ్లలో సర్దుబాటు చేయాలని.. రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు విద్యా శాఖ అధికారులు తెలిపారు. తల్లిదండ్రుల నుంచి సేకరించిన అభిప్రాయాలతో తయారు చేసిన నివేదికను ఆ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిర్ణయం ప్రకారమే స్కూల్‌పై చర్యలు ఉంటాయని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పోలీసు కస్టడీకి లైంగికదాడి నిందితులు
బంజారాహిల్స్, అక్టోబర్ 29: నాలుగున్నరేండ్ల బాలికపై జరిగిన లైంగికదాడి కేసులో నిందితులను శనివారం బంజారాహిల్స్ పోలీసులు కోర్టు అనుమతితో నాలుగు రోజుల కస్టడీకి తీసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న బాలికపై స్కూల్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న రజినీకుమార్ లైంగికదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులోని నిందితులు రజినీకుమార్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధవి వద్ద నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారిని పోలీస్ కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు పోలీసుల విచారణకు కోర్టు అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందే ప్రధాన నిందితుడు రజినీకుమార్కు ఉస్మానియా ఆస్పత్రిలో పొటెన్సీ టెస్ట్‌ను నిర్వహించారు. లైంగికదాడి ఘటనలో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.