నాంపల్లి, అక్టోబర్ 29: తెలంగాణ గడ్డపై ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు గద్దల్లా వాలి కేసీఆర్‌ను తిట్టడమే తప్ప రాష్ర్టానికి చేసిందేమీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. నాంపల్లి మండలకేంద్రంలోని నక్క సునంద ఫంక్షన్హాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పి ప్రజలను ఓట్లు అడుగాలన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం చేతకాదుకానీ, ఇతర రాష్ర్టాల్లోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆ ప్రభుత్వాలను కూలదోయడం తెలుసా? అని ప్రశ్నించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇస్తూ ప్రజలకు అండగా ఉంటున్నారన్నారు. మునుగోడు నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు. సమావేశంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్, జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కంభం కృష్ణారెడ్డి, గుర్రం పవన్‌కుమార్‌గౌడ్, నాంపల్లి సత్తయ్య, బెల్లి సత్తయ్య, నక్క చంద్రశేఖర్, గౌరీ కిరణ్, వెంకట్‌రెడ్డి, కుంభం శ్రీధర్‌రెడ్డి, కుంభం చరణ్‌రెడ్డి, కామిశెట్టి పాండు, పెద్దిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, పల్లా పర్వతరెడ్డి, గుండెబోయిన సత్తయ్య పాల్గొన్నారు.