సుల్తాన్‌బజార్,అక్టోబర్ 29: సమాజ అభివృద్ధి కోసం బ్రహ్మ సమాజం అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య అన్నారు. ఈ మేరకు శనివారం రాంకోఠిలోని ఈడెన్ గార్డెన్స్ ప్రాంతంలో ఉన్న కచ్చి భవన్లో దక్కన్, ఆంధ్ర బ్రహ్మ సమాజ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో అఖిల భారత బ్రహ్మ సమాజం 131వ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన సమావేశాలను ప్రారంభించి మాట్లాడారు. బ్రహ్మ సమాజ వ్యవస్థాపకుడు రాజారామ్ మోహన్‌రాయ్ సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు పాటిస్తే సమాజంలో శాంతి చేకూరుతుందని తెలిపారు. బ్రహ్మ సమాజం కుల, మతాలకు వ్యతిరేకంగా ఉండాలని, మానవులందరూ ఒక్కటే, భగవంతుడు ఒక్కడే అని సమ భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్లి సనాతన భారతీయ సంప్రదాయాన్ని కొనసాగించేందుకు కృషి చేసిందని కొనియాడారు. కార్యక్రమంలో అఖిల భారత బ్రహ్మ సమాజం అధ్యక్షుడు డాక్టర్ అరూప్‌కుమార్, దక్కన్ బ్రహ్మ సమాజం అధ్యక్షుడు కేశవ్ చంద్ అఖిల భారత బ్రహ్మ సమాజం కార్యదర్శి సౌరవ్ డే, హై కోర్టు సీనియర్ అడ్వకేట్ పద్మావతి రాహుల్ శాస్త్రి, దక్కన్ బ్రహ్మ సమాజం కార్య దర్శి అజయ్ గౌతమ్,స మావేశాల కమిటీ చైర్మన్ అనందిత గౌతమ్ పాల్గొన్నారు.