హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక వేధింపుల ఘటనలో గుర్తింపు రద్దుచేసిన బీఎస్‌డీ డీఏవీ స్కూల్‌ను తిరిగి తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాఠశాలను తిరిగి తెరవాలని తల్లిదండ్రులు గట్టిగా పట్టుబట్టుతుండటంతో విద్యాశాఖ ఈ దిశగా పునరాలోచన చేస్తున్నది. వారంలోగా ఓ నిర్ణయం తీసుకోనున్నట్లుగా విద్యాశాఖ వర్గాల ద్వారా తెలిసింది. అయితే, పాఠశాలను తెరిచే విషయంపై తమకు అధికారులు హామీ ఇచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాలను తిరిగి తెరవాలని కోరుతూ పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనతో సైఫాబాద్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో భేటీ అయ్యారు.
డీఏవీ స్కూల్స్ డైరెక్టర్ నిషా పేషిన్, స్కూల్ మేనేజర్ శేషాద్రి సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. తల్లిదండ్రుల అభిప్రాయాలతో కూడిన బ్యాలెట్ బాక్స్‌ను తీసుకొచ్చిన ప్రతినిధులు ఆ బాక్స్‌ను శ్రీదేవసేన ముందు తెరిచారు. స్కూల్‌ను తెరవాలంటూ తల్లిదండ్రుల సంతకాలతో కూడిన రిజిస్టర్‌ను సైతం శ్రీదేవసేనకు సమర్పించారు. మొత్తంగా చర్చలు పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులను సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామని శ్రీదేవసేన చెప్పినట్లుగా తెలిసింది.
అనంతరం పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. విద్యాసంవత్సరం మధ్యలో గుర్తింపును రద్దుచేసి.. ఇతర స్కూళ్లల్లోకి పంపించడంతో తమ పిల్లలు నష్టపోయే ప్రమాదం ఉన్నదని, 535 మంది తల్లిదండ్రుల్లో 500 మంది తల్లిదండ్రులది ఇదే అభిప్రాయమని చెప్పారు. కొత్త యాజమాన్యం, కొత్త సిబ్బందితో పాఠశాలను నడపాలని తాము కోరామని తెలిపారు. తల్లిదండ్రులు కొన్ని సూచనలు చేస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఇదిలా ఉండగా.. తల్లిదండ్రులతో భేటీ ముగిసిన అనంతరం పాఠశాల వ్యవహారంపై తనకు నివేదిక ఇవ్వాలని శ్రీదేవసేన హైదరాబాద్ డీఈవో రోహిణిని ఆదేశించారు. డీఈవో నివేదికను సమర్పించారు. ఆ నివేదికను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు సమర్పించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలిసింది.
పాఠశాల నిర్వహణలో తప్పులను సరిదిద్దుకుంటామని బీఎస్‌డీ డీఏవీ స్కూల్ మేనేజర్ శేషాద్రి మీడియాకు తెలిపారు. తల్లిదండ్రులతో కలిసి తాము సైతం వినతి పత్రం సమర్పించామన్నారు.పాఠశాల గుర్తింపును పునరుద్ధరించాలని కోరామన్నారు.
డీఏవీ స్కూల్ వ్యవహారంలో నిందితులను కఠినంగా శిక్షించాలని పలువిద్యార్థి సంఘాలు సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించాయి.
బంజారాహిల్స్, అక్టోబర్ 26: బాలికపై లైంగికదాడి ఘటనలో అరెస్టయి.. జైల్లో ఉన్న డీఏవీ పబ్లిక్ స్కూల్ డ్రైవర్ రజినీకుమార్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధవిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు దాఖలుచేసిన పిటిషన్‌పై బుధవారం నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. నిందితుల వద్ద నుంచి సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉన్నదని పేర్కొంటూ.. కస్టడీకి ఇవ్వాలని పోలీసుల తరఫు న్యాయవాది కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తమ తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెలువరించవచ్చని పోలీసులు తెలిపారు.