సికింద్రాబాద్, అక్టోబర్ 26: ఉదయాన్నే అందరూ నిద్ర నుంచి మేల్కొని, ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరి నిర్లక్ష్యం.. నిండు ప్రాణాన్ని బలిగొనడమే గాకుండా, చుట్టుపక్కల వారిని సైతం ఆస్పత్రి పాలుజేసింది. అలసత్వం, తొందరపాటు చర్యతో గ్యాస్ లీకైన విషయాన్ని మరిచి స్టౌను వెలిగించే లోపే ఘోర ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధ్దంతో సిలిండర్ పేలింది.
పేలుడు ధాటికి ఇంటి ముందు ఉన్న ఇండ్లతోపాటు వెనుక భాగంలో ఉన్న సుమారు 12 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి..మెట్టుగూడ డివిజన్ దూద్‌బావి బస్తీలో మహ్మద్ జాఫర్, అలీమాబేగం దంపతులు నివాసముంటున్నారు. జాఫర్ చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తాడు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక నిద్రకు ఉపకరించడంతో బుధవారం ఉదయం కొంత ఆలస్యంగా లేచారు. ఉదయం 8.40 గంటలకు వంట చేద్దామని అలీమా బేగం వంట గదిలోకి వెళ్లి స్టౌను వెలిగించింది.
దీంతో ఒక్కసారిగా సిలిండర్ పేలి.. భారీగా శబ్ధం వచ్చింది. సమీపంలోనే ఉన్న సుమారు 12 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జాఫర్, అలీమాబేగంతో సహా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో దూద్‌బావి బస్తీలో ఏం జరుగుతుందో అర్థంకాక బస్తీవాసులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు చిలకలగూడ పోలీసులు గాయపడ్డ ఎనిమిది మందిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన వారిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న నారాయణ స్వామి(55) చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన జాఫర్, అలీమా బేగం, ఎస్.నర్సింగ్‌రావు, పొడిశెట్టి శ్రీనివాస్, బి. ఊర్మిళను తొలుత గాంధీ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు క్షతగాత్రులు శైలజ, సంజన గాంధీలోనే చికిత్స పొందుతున్నారు.
కాగా, ఘటనా స్థలిని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్, ఆర్డీవో వసంతకుమారి, జాయింట్ సీపీ, నార్త్ జోన్ డీఐజీ కార్తికేయ, నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు సందర్శించి, బాధితులను పరామర్శించారు. వైద్యాధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలని కోరారు. గ్యాస్ లీక్ కావడం వల్లే సిలిండర్ పేలి ఈ ప్రమాదం జరిగినట్లు నార్త్‌జోన్ డీసీపీ చందనా దీప్తి తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.