సుల్తాన్‌బజార్, అక్టోబర్ 26 : రాష్ట్రంలోని ప్రతిఒక్క పేదవాడు ఉన్నతంగా విద్యను అంది పుచ్చుకోవాలనే సంకల్పంతో ప్రభు త్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ విద్యా సంస్థలను మరింత అభివృద్ది పరిచేందుకు చర్యలు చేపడుతుంది. మాసాబ్ ట్యాంక్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ పీజీ సైఫాబాద్ కళాశాలలో శిథిలావస్థకు చేరిన విద్యార్థుల వసతి గృహాలను కార్పొరేట్‌కు దీటుగా జీ ప్లస్ – 3 అంతస్తుల భవనాన్ని నిర్మించి అన్ని వసతులను సమకూర్చారు. దీంతో విద్యార్థుల సంతోషానికి అవధులు లేవు. పై అంతస్తులోకి వెళ్లేందుకు రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. 300కు పైగా విద్యార్థులకు వసతి కల్పించేందుకు గాను నిర్మించిన ఈ హాస్టల్లో ప్రస్తుతం280కి పైగా ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. హాస్టల్ విద్యార్థులకు అన్ని సదుపాయాలను కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జే లక్ష్మణ్ నాయక్ అన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చి దిద్దడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నది. శిథిలావస్థకు చేరిన హాస్టల్‌ను కోట్ల నిధులను వెచ్చించి అత్యంత విశాల హాస్టల్ భవనాన్ని నిర్మించారు. 300కు పైగా విద్యార్థులు ఉండేలా నిర్మాణాలు చేపట్టారు.గ్రౌండ్ఫోర్తో పాటు రెండు అంతస్తులతో అత్యాధునిక స్థాయిలో గదులను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తుందో ఈ హాస్టల్ భవనమే నిదర్శనంగా పేర్కొనవచ్చు.
విద్యార్థులకు మెరుగైన శిక్షణతో పాటు వసతిని కల్పించాం. కళాశాల ఆవరణలో నిర్మించిన హాస్టల్ భవనం కార్పొరేట్ స్థాయిలో ఉన్నది. గతంలో శిథిలావస్థలో ఉన్న హాస్టల్ గదుల్లో వర్షా కాలం వచ్చిందంటే ఇబ్బందులు పడేవారు. వసతితో పాటు రుచికరమైన ఆహారాన్ని అందిస్తుండటంతో కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
– జే లక్ష్మణ్ నాయక్, కళాశాల ప్రిన్సిపాల్
సైఫాబాద్ సైన్స్ కళాశాలలోనే నేను విద్యాభ్యాసం చేశాను. నేను చదువుకునే సమ యంలో శిథిలావస్థకు చేరిన హాస్టల్ గదులలో ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో జీ ప్లస్ -3 భవనాన్ని నిర్మించడం ఆనందదాయకం. అన్ని వసతులు ఉండటంతో విద్యార్థుల సంఖ్య 300కు చేరింది. ఇపుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
– పల్లాటి నరేశ్, హాస్టల్ వార్డెన్