మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 26: ఏండ్లుగా ముంపు ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సీవరేజ్ పైప్లైన్ పనులతో శాశ్వత పరిష్కారం చేశారు. దమ్మాయిగూడ పట్టణంలోని పలు వార్డులు, కాలనీలు వర్షాలకు ప్రతి ఏటా ఇబ్బందులు పడుతుండే వారు. వర్షాకాలం వచ్చిందంటే దమ్మాయిగూడ ప్రజలకు కంటిపై కునుకు ఉండదు. వర్షం ఓ మోస్తారుగా కురిసినా వరద నీరు ఇండ్లలోకి చేరిపోయేది. దాంతో పాటు మురుగునీరు, క్రిమికీటకాలు ఇండ్లలోకి చేరి నిద్రకు దూరమైన రాత్రులు ఎన్నెన్నో. వీధులన్నీ జలమయమై బయట కాలుపెట్టలేని దుస్థితి. ప్రజల బాధలను గుర్తించిన మంత్రి మల్లారెడ్డి పరిష్కారానికి కృషి చేశారు. వరదనీరు కాలనీలకు ముంచెత్తకుండా అవసరమైన ప్రణాళికపై అధికారులతో చర్చించి, నిధులు మంజూరు చేయించారు.
గతేడాది కురిసిన భారీ వర్షాలకు వరద నీరు కాలనీలను ముంచెత్తింది. ప్రజలు తీవ్ర కష్ట,నష్టాలను ఎదుర్కొ న్నారు. ఆస్తినష్టం జరుగడంతో పాటు ప్రజలు అనారోగ్యాల పాలయ్యారు. ఇంట్లోని వస్తువులు తడిసి ముద్దవడంతో వంటసామగ్రి, బట్టలు, ఇతర వస్తువులు పాడయ్యాయి. దుర్వాసన వెదజల్లే నీటితో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముంపు బారిన పడిన పలు కాలనీలో పర్యటించిన మంత్రి ప్రజలు కష్టాలు చూసి, చలించిపోయారు. సమస్యకు పరిష్కారం చూపాలని అప్పుడే భావించారు. శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. అందులో భాగంగా సీవరేజ్ పైపులైన్ నిర్మాణానికి కృషి చేశారు.
దమ్మాయి చెరువు నుంచి బానాయి చెరువు, నాసింగ్ చెరువుల వరకు మొదటి విడుత రూ.7.10 కోట్లతో చేపట్టిన సీవరేజీ పైప్లైన్ పనులు వేగంగా పూర్తి చేశారు. 13, 14, 15వ వార్డుల్లోని ఇంద్రప్రభకాలనీ, వీఎన్ఎస్ హోమ్స్, ఎల్ఎస్ఆర్నగర్, ఎంఎల్ఆర్ కాలనీ, సత్యనారాయణ కాలనీ, అంజనాద్రికాలనీ, సాయి శ్రీనివాస్ కాలనీ, లక్ష్మీ నగర్ తదితర కాలనీల్లో పనులు చేపట్టారు. రెండో విడుత 8, 9వ వార్డులలో నిధులు మంజూరు కాగానే పనులు మొదలు పెట్టనున్నారు. ఈ పనుల్లో భాగంగా దమ్మాయిగూడ,నాసింగ్ చెరువులను వర్షపు నీటితో నింపి సుందరీకరించనున్నారు.
వర్షాలకు కాలనీలు మునగకుండా మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక చొరువతో శాశ్వత పరిష్కారం లభించింది. వానలు పడినప్పుడు అనేక కాలనీ ప్రజలు ఏండ్లుగా ఇబ్బందులు పడ్డారు. 13, 14, 15వ వార్డు ల్లో మొదటి దశ సీవరేజీ పైప్లైన్ పనులు పూర్తి చేశారు.8,9వ వార్డులలో రెండో దశ పనులను మంత్రి సహకారంతో త్వరలోనే మొదలు పెడు తాం.8, 9వ వార్డుల్లో సీవరేజీ పైప్లైన్ పనులు పూర్తి అయితే వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు ఉండవు.
– వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, చైర్పర్సన్, దమ్మాయిగూడ