సైదాబాద్, అక్టోబర్ 26 : సైదాబాద్ ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు నడిచే ప్రధాన రహదారి నరక ప్రయాణానికి కేరాఫ్‌గా ఉన్నది. మరోవైపు నత్తతో పోటీ పడుతున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులతో గుంతల మయంగా మారిన ప్రధాన రహదారితో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు అనేకం. చంచల్‌గూడ జైలు చౌరస్తా నుంచి సంతోష్‌నగర్ ఒవైసీ దవాఖాన వరకు రోడంతా అధ్వానంగా తయారైంది. వివిధ జిల్లాకు అనుసంధానంగా ఉన్న రోడ్ కావటంతో ప్రయాణించే వాహనదారులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్ఆర్డీపీ సంస్థ చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు సత్తనడక నడుస్తుంటంతో వాహనదారులకు ఈ దారి ప్రమాదకరంగా మారి నిత్యం ప్రమాదాలు చోటు చేసుకోవటంతో దవాఖానలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
వరసగా వర్షాలు కురియటంతో గుంతలమయంగా మారాయి. వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందులు తొలగించటానికి జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. వివిధ ప్రాంతాల్లో పాడైపోయిన రోడ్లను క్షేత్రస్థాయిలో రోడ్లను పరిశీలించి వాటి మరమ్మతులకు చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంతో కలుగుతున్న ఇబ్బందులను తొలగించటానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. తక్షణ పరిష్కార పనుల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో గుంతలను పూడ్చటానికి అవరమైన కాంక్రిట్ డస్ట్, మిక్సిడ్ కంకర వేసి గుంతలను పూడ్చివేత పనులను వేగంగా కొనసాగిస్తున్నారు. రహదారిపై ఉన్న మురుగునీటి వ్యవస్థల ఆధునీకరణ పనులను కూడా మొదలుపెట్టి వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
సైదాబాద్ ప్రధాన రహదారిపై ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందులు గుర్తించాలి. జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టాలి. వర్షాలతో ఏర్పడ్డ గుంతలను పరిశీలించి పూడ్చివేయాలి. రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండటంతో అవస్థలు పడుతున్నారు. రోడ్ల అభివృద్ధి, మ్యాన్‌హోళ్ల ఆధునీకరణ పనులు అధికారులు మొదలు పెట్టాలి.
– కొత్తకాపు అరుణ, సైదాబాద్ కార్పొరేటర్
సమస్యల పరిష్కారా నికి చర్యలు తీసుకుంటున్నాం. జలమండలి, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. డ్రైనేజీ, తాగునీటి పైపులైన్ల నిర్మాణ పనులు, మరమ్మతుల కారణంగా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొంత నెమ్మదిగా కొనసాగుతున్నాయి. పనులను త్వరితగతిన పూర్తిచేయటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
– హర్షిత్‌రెడ్డి, ఏఈ , జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ విభాగం