కొండాపూర్, అక్టోబర్ 26 : పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా బుధవారం కొండాపూర్‌లోని 8వ పోలీసు బెటాలియన్‌లో కమాండెంట్ పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ సొసైటీతో కలిసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాల కన్న రక్తదానం గొప్పదని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు. కొవిడ్ సమయంలో రక్త నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయని, ఆరోగ్యవంతులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలన్నారు.
ప్రమాదాలలో తీవ్ర రక్తస్రావాలతో దవాఖానలకు వస్తున్న వారికి సరైన సమయంలో రక్తం అందితే ప్రాణాలు నిలుస్తాయని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా, బాధ్యతతో రక్తదానం చేయాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ టీ. గంగారాం, అసిస్టెంట్ కమాండెంట్లు వీ. నరసింహస్వామి, డీ సత్యనారాయణ, డీ నారాయణదాస్, యూనిట్ మెడికల్ ఆఫీసర్ జ్యోతిబాపూలే, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, అక్టోబర్ 26: రాయదుర్గం పోలీస్‌స్టేషన్ ఆవరణలో పోలీసు సిబ్బందితో పాటు వారి కుటుంబసభ్యులకు బుధవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. లాండ్ ఆర్డర్ పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసులు వారి కుటుంబసభ్యులతో కలిసి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. బీపీ, మధుమేహ, వివిధ పరీక్షల కోసం రక్తనమూనాలను సేకరించడంతో పాటు నేత్ర, దంత వైద్య పరీక్షలు సైతం ఈ వైద్యశిబిరం నిర్వహించారు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ ఎం.మహేశ్‌తో పాటు పలువురు ఎస్ఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది ఈ వైద్యశిబిరంలో పాల్గొని వైద్యపరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి వైద్యులు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
అపోలో హాస్పిటల్‌కు చెందిన వైద్యబృందం సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించగా, అగర్వాల్ కంటి దవాఖాన వైద్యులు నేత్ర, ఎఫ్ఎంఎస్ దంత వైద్యశాల ఆధ్వర్యంలో పోలీసులకు దంత పరీక్షలు నిర్వహించారు. నిత్యం విధి నిర్వహణలో బిజీబిజీగా ఉండే పోలీసు సిబ్బంది మానసికంగా, శారీరకంగా ధృడంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా వైద్యశిబిరం ఏర్పాటుచేయడం జరిగిందని రాయదుర్గం ఇన్స్పెక్టర్ ఎం.మహేశ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.