అల్వాల్, అక్టోబర్ 26: హైదరాబాద్ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తోంది… పట్టణీకరణ నేపథ్యంలో జనాభా కూడా పెరుగుతోంది. అయితే నగరంలో గజిబిజి జీవనానికి దూరంగా చాలామంది హైదరాబాద్‌కు దగ్గర్లో ప్రశాంత వాతావరణం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగా శివారు ప్రాంతమైన అల్వాల్‌లోనూ నివాసం ఉంటున్నారు. ఇక్కడి నుంచి నగరంలోని ఆఫీసులకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో గతంలో కంటే ఇప్పుడు వాహనాల రద్దీ భారీగా పెరిగింది.
గతంతో పోలిస్తే ఇప్పుడు శివారు నుంచి నగరానికి నిత్యం రాకపోకలు భారీగా పెరిగాయి. ఇక ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు ఉంటే.. ఎవరికి వారు తమ వాహనాల్లో కార్యాలయాలకు వెళ్తున్నారు. దీంతో అల్వా ల్ నుంచే వేల వాహనాలు నగరంలోకి వచ్చి వెళ్తున్నా యి. దీంతో అల్వాల్ నుంచి జేబీఎస్ వైపు, అల్వాల్ నుంచి సుచిత్ర వెళ్లే ప్రధాన మార్గాలు కిక్కిరిసిపోతున్నాయి. పనిదినాల్లో ఉదయం, సాయంత్రం భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అల్వాల్.. అటు కరీంనగర్ హైవేకు, ఇటు నాగ్‌పూర్ హైవేకు మధ్యలో ఉంటుంది. దీంతో ఇక్కడ ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంటూ ఏమీ లేదు. ఇక్కడికి బదులు నాగ్‌పూర్ హైవేలో పేట్‌బషీరా బాద్‌లో ట్రాఫిక్ పీఎస్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఈ ప్రాం తాన్ని పోలీసులు పరిశీలిస్తుంటారు. ఇక కరీం నగర్ హైవేలోని తిరుమలగిరి పీఎస్ పరిధికి అల్వాల్‌లోని కొంత భాగం వస్తుంది. దీంతో ఈ రెండు పీఎస్‌ల ఆధ్వర్యంలో ఇటీవల అల్వాల్ మీ-సేవా కేంద్రం వద్ద, ఇందిరాగాంధీ సర్కిల్ వద్ద, లయోలా అకాడమీ వద్ద సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. వీటి వల్ల వాహనాల నియంత్రణ జరుగుతున్నా.. రోడ్ల వెడల్పు సరిపడా లేకపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
ముఖ్యంగా ఇందిరాగాంధీ సర్కిల్ వద్ద రోడ్డు మరీ ఇరుకుగా మారింది. అప్పట్లో వేసిన రోడ్డు కావడంతో ఇప్పటి వాహనాల కెపాసిటీకి సరిపోవడం లేదు. దీంతో అక్కడ సిగ్నల్స్ పడటంతో వాహనాలు ఆగినా ఫ్రీలెఫ్ట్ కూడా మూసుకుపోతోంది. దీంతో ఒక్కోసారి వాహనా లు కిలోమీటర్ మేర నిలిచిపోతున్నాయి. దీనికి సర్కిల్ విస్తరణ ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తోంది. ఇక ఈ సర్కిల్ నుంచి సుచిత్ర వెళ్లే మార్గంలో ఎలాంటి ఇబ్బం దులు లేకున్నా.. ఎడమవైపు డెయిరీఫామ్‌కు వెళ్లే రోడ్డులో రైల్వే ట్రాక్ ఉంది. రైళ్లు వచ్చినప్పుడు అక్కడ గేట్ పడుతుంది. దీంతో అటువైపు వెళ్లే వాహనాలు నిలి చిపోయి ఇందిరాగాంధీ-సుచిత్ర మార్గం వరకూ బారులు తీరుతున్నాయి. ఫలితంగా ఈ మార్గంలో ట్రాఫి క్ జామ్ అవుతోంది. ఇందుకు రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ లేదా బ్రిడ్జి నిర్మించడమే పరిష్కారం.
ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు మా వంతు బాధ్యత నిర్వర్తిస్తున్నాం. సిగ్నల్స్ ఏర్పాటు చేసి నిత్యం కానిస్టేబుళ్లతో పర్యవేక్షిస్తున్నాం. ఇందిరాగాంధీ సర్కిల్ విస్తరిస్తే సమస్య తీరుతుందని భావిస్తున్నాం. రోడ్డు మధ్యలో కూడా కోన్లు పెట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపడుతున్నాం. వాహనదారులు కూడా ఓపికగా రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగి ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేయకుండా ఉండాలి. ఇక సర్కిల్ విస్తరణపై జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించాం. రోడ్డు విస్తరణకు కృషి చేస్తాం.
– రాజు, అల్వాల్ ట్రాఫిక్ సీఐ