చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 23: మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్ జెండాయేనని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ప్రజలను ఎన్ని విధాలుగా ప్రలోభపెట్టినా భంగపాటు తప్పదని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ మండలంలోని కోయిలగూడెం గ్రామంలో ఆదివారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ టీఆర్ఎస్ వెంటే ఉన్నారని అన్నారు. మునుగోడు అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలందరూ ఫ్లోరైడ్‌తో తీవ్ర ఇబ్బందులు పడినా గత ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.
తెలంగాణ ఆవిర్భవించాక సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చి ఇక్కడి ఫ్లోరైడ్‌ను పారదోలారని గుర్తుచేశారు. కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్లకు భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. ప్రచారంలో భాగంగా ఆయనకు గ్రామ మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మాచర్ల కృష్ణ, ప్రభాకర్, శీనురెడ్డి, రాజిరెడ్డి, శ్రీశైలం, నాగరాజు, ప్రసాద్‌రెడ్డి, మల్లారెడ్డి, గంజి శ్రీను పాల్గొన్నారు.