చండూరు, అక్టోబర్ 23: చండూరు మండలం ఉడతలపల్లి, పడమటితాళ్ల, దుబ్బగూడెం, కస్తాల గ్రామాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో తనకు ఇక్కడి ప్రజలు అవకాశమిస్తే, ఈ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, ప్రజల కాళ్లు కడుగుతానని హామీ ఇచ్చారు. దళిత, రైతు, గిరిజనుల అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకమన్నారు. మతోన్మాద పార్టీ అయిన బీజేపీని ఉప ఎన్నికల్లో మట్టుబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో తన ఓటు తానే వేసుకోలేదడన్నారు.
రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు ప్రాంతంలో ఉన్న ఊర్ల పేర్లు ఇప్పటికీ తెలియదని ఎద్దేవా చేశారు. అలాంటి వారికి ఓటు వేస్తే, మునుగోడు అభివృద్ధి జరుగదన్నారు. రాజగోపాల్‌రెడ్డి ప్రజల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని, అతనికి కాంట్రాక్టర్లు, స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయి, గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇచ్చి కొంటున్నాడని విమర్శించారు. 365 రోజుల్లో మూడు వందల రోజులూ ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రతీ గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తానని పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశాన్ని ఆకర్షించేలా ఉన్నాయన్నారు. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్కు పోటీ లేదన్నారు. అంతకు ముందు ఉడుతలపల్లిలో మహిళలు బోనాలతో వచ్చి, కూసుకుంట్లకు స్వాగతం పలికారు. ఆయన వెంట సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు ఉన్నారు.
మునుగోడు ప్రాంతాన్ని సస్యశ్యామలం
చేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థిని అయిన నన్ను భారీ మెజార్టీతో ఈ ప్రాంత ప్రజలు గెలిపించాలి. గత ఎన్నికలో ఓడిపోయినా ప్రజల మధ్యే ఉన్నా.. మునుగోడు ప్రజలే నా కుటుంబ సభ్యులు.. నిత్యం వారికి అందుబాటులో ఉండి, పని చేస్తున్నా.
రాజగోపాల్‌రెడ్డి ఊసే కనిపిస్తలేదు..
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి ఊసే కనిపిస్త లేదని, ఎక్కడ చూసినా టీఆర్ఎస్ జెండాలే కనిపిస్తున్నాయని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి అన్నారు. రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు ప్రాంత సమస్యలపై అవగాహన లేదన్నారు. అందుకే ఎక్కడికెళ్లినా ఆయనను నిలదీస్తున్నారని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి గ్రామంలో ఒకరిద్దరికి సాయం చేస్తే, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయని పేర్కొన్నారు. 18వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయిన విషయం నియోజకవర్గంలో ఉన్న చిన్న పిల్లల నుంచి పండు ముసలవ్వ దాకా తెలుసన్నారు. టీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణను బీజేపీ తట్టుకోలేకపోతున్నదని పేర్కొన్నారు.
రాజగోపాల్‌రెడ్డి ఈ ఎన్నిక కోసం పెట్టే ఖర్చును ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పెడితే, వచ్చే ఎన్నికల్లో ప్రజలే గెలిపించేవారని సూచించారు. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న గేమ్ అని అన్నారు. మాటిమాటికి సీఎం మనకు పైసలియ్యలేదని అంటున్న రాజగోపాల్, మరి ఇప్పుడు గెలిస్తే ఏంటి పరిస్థితి.. నీ మాట ప్రకారమే కాంగ్రెస్‌లో ఉంటే ఇవ్వని ముఖ్యమంత్రి, ఇప్పుడు బీజేపీలో గెలిస్తే ఫండ్స్ వస్తాయా? అని ప్రశ్నించారు. స్వార్థపరుడైన రాజగోపాల్‌రెడ్డిని ఓడించి, టీఆర్ఎస్కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.