మేడ్చల్, అక్టోబర్23(నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోని బీజేపీ నాయకులు మునుగోడులో ఓట్లు అడిగేందుకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రం నుంచి ఒక్క రూపాయైనా నిధులు తీసుకొచ్చారా? అని విమర్శించారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, గుండ్లబావి గ్రామంలో అదివారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరుపేద, మధ్యతరగతి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మంత్రి అన్నారు. మునుగోడులో బీజేపీకి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ర్టాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతుగా టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
రవాణా రంగ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం..
చౌటుప్పల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్కేవీ, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో మోటర్, రవాణా రంగ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. కార్మికుల అభివృద్ధికి చేయూతను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతు ఇవ్వాలని , టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.