రవీంద్రభారతి,అక్టోబర్ 23 : “బతుకమ్మ వాస్తవ స్వభావాన్ని, జరుగాల్సిన తీరును నేటి ఆధునీకరణ దెబ్బతీశాయి. బతుకమ్మ అంటే డీజే కాదు.. ఊరి జ్ఞాపకాలు, గత కాలం వైభవాలు గుర్తుతెచ్చుకుంటూ బతుకమ్మ పాటలను రెండు, మూడు గంటల పాటు పాడేవారే అసలైన జానపదులు” అని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ డిజిటల్ మీడియా, తెలంగాణ పదాలు-ఇసిరెలు-సంస్కృతి గ్రూప్‌ల సంయుక్త ఆధ్వర్యంలో.. బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ వీడియోల పోటీలు నిర్వహించారు. ఇందులో ఎంపికైన విజేతలకు ఆదివారం రవీంద్రభారతి మినీహాల్లో బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్‌రెడ్డి, విశిష్ట అతిథులుగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణలు విచ్చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంస్కృతిలో భాగమైన భాషను కాపాడుకుంటే సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకున్నట్లేనని వక్తలు తెలిపారు. గడిగోలు గ్రూప్ ద్వారా తెలంగాణలోని వాడుక పదాలను ఒకచోట చేరుస్తూ తెలంగాణ భాష కలకాలం నిలిచేలా కృషిచేస్తున్నారని వారు ప్రశంసించారు. ఆడబిడ్డల మనోవేదన, మనోభావాల వ్యక్తీకరనే బతుకమ్మ పాట అని, తెలంగాణ ఆడబిడ్డలు ఆటపాటలతో తమ మనసును తేలిక చేసుకునే విధానమని తెలిపారు. బతుకమ్మ పేరిట టీవీ చానళ్లు రూపొందిస్తున్న పాటలు సంస్కృతి, సంప్రదాయాలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాటి ఆట పాటలను మళ్లీ మనకు గుర్తు చేస్తున్న గడిగోలు గ్రూప్ సభ్యులను వక్తలు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్, గడిగోలు గ్రూప్ నిర్వాహ కులు సుధీర్‌కుమార్, రచయిత స్వర్ణకిలారి, నవీన్ పాల్గొన్నారు.
విజేతలు వీరే
1. జి. రాజ్‌కుమార్, హన్మకొండ ప్రథమ బహుమతి (రూ. 14,000)
2. తేజ గౌడ్, సంస్థాన్ నారాయణ్ పూర్, యాదాద్రి జిల్లా ద్వితీయ బహుమతి (రూ. 12,000)
3. చెట్టె మల్లికార్జున్, కట్లకుంట, జగిత్యాల జిల్లా తృతీయ బహుమతి (రూ. 10,000)
ప్రత్యేక ప్రశంస.. బహుమతులు
– నర్మెట్ట గ్రామం (రూ. 10,000)
– సునీల్ సముద్రాల, గోదావరిఖని (రూ. 6,000) సంపత్ పులం, పెగడపల్లి, జగిత్యాల జిల్లా (రూ. 6000)
కన్సోలేషన్ బహుమతులు
1. జిట్ట జ్యోతిరెడ్డి, భువనగిరి జిల్లా (రూ.6,000)
2. అఖిలేశ్ కాసాని, సిద్దిపేట (రూ.6,000)
3. మధుసూదన్ కోట, పూదూరు (రూ. 6,000)
4. వడ్డిపర్తి సంతోశ్ (రూ.6,000)
5. లహరి పెండ్యాల, ఎల్లారెడ్డిపేట (రూ.6,000)
6. కె. విజయ్, జన్నారం (రూ.6,000)