కవాడిగూడ, అక్టోబర్ 23 : క్యాన్సర్ బాధితుల్లో మనోైస్థెర్యాన్ని పెంపొందిచాల్సిన అవసరం ఉందని టీఎస్ ఆర్టీసీ ఎండీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ అన్నారు. ప్రపంచ రొమ్ము క్యాన్సన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వస్తవ క్యాన్సర్ కేర్, రోటరీ డిస్ట్రిక్ట్-3150, హార్ట్‌రాక్ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో దోమలగూడలోని ఏవీ కళాశాల విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణం నుంచి ట్యాంక్‌బండ్ వరకు అవగాహన నడకను ఆయన జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా ఎంతో మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
క్యాన్సర్ వచ్చిందని తెలియగానే చాలా మంది మానసికంగా కృంగిపోతున్నారని, అలాంటి వారికి తోడుగా నిలువాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్‌పై టీస్ ఆర్టీసీ సంస్థ తరఫున రోటరీ క్లబ్, స్వస్తవ క్యాన్సర్ కేర్ సంస్థలతో కలిసి ఆర్టీసీ బస్టాండ్లు, బస్టాప్‌లు, డిపోలలో హోర్డింగ్‌లు, ప్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే తొందరగా నయం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్‌జే సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ఎం.శ్రీనివాసులు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సంరక్షిత, మాజీ డీజీ(ఐపీఎస్), స్వస్తవ క్యాన్సర్ కేర్ సంస్థ అధ్యక్షుడు ఆర్పీ సింగ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చతుర్వేది, అంజయ్య, రాంప్రసాద్, శ్రీదేవి, అమరేందర్‌రెడ్డి, ఉపారాణి, ఏవీ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.