సిటీ బ్యూరో, అక్టోబర్ 23(నమస్తే తెలంగాణ) : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరం జిగేల్ మనిపించే వెలుగులతో ముస్తాబైంది. ఇండ్లు, అపార్టుమెంట్లు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, కార్యాలయాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఒకప్పుడు నూనె దీపాలను అందంగా ఏర్పాటు చేస్తే, ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన తీరొక్క కలర్స్‌తో కూడుకున్న విద్యుత్ దీపాలతో మరింత ఆకర్షణీయంగా మారింది. నగరంలోని ప్రధాన మార్కెట్లు పూలు, పండ్ల కొనుగోళ్లతో సందడిగా మారాయి. మార్కెట్ల నుంచి కొనుగోలు చేసిన పూలు, మామిడి తోరణాలతో లక్ష్మీ పూజల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.