మన్సూరాబాద్, అక్టోబర్ 23: డబ్బు ఏండ్లలో పరిష్కారం కాని ఫ్లోరైడ్ భూతాన్ని మిషన్ భగీరథ తాగునీటితో సీఎం కేసీఆర్ తరిమి కొట్టారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నగరంలో జీవిస్తున్న మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన ప్రజలతో ఆదివారం మన్సూరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరై మాట్లాడారు. ఉమ్మడి పాలనలో 70 ఏండ్లలో సాధ్యం కాని ఫ్లోరైడ్ సమస్యను సీఎం కేసీఆర్ అనతికాలంలోనే పరిష్కరించారన్నారు.
మునుగోడు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దేని కోసం రాజీనామా చేశారని ప్రశ్నించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి 18వేల కోట్ల కాంట్రాక్టు పొందడానికి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు కారకుడయ్యాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.