సైదాబాద్, అక్టోబర్ 23 : ఆయుర్వేద వైద్యంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఆయూష్) సంస్థ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ పీజీ ప్రసాద్ అన్నారు. ఆదివారం సైదాబాద్ డివిజన్ పరిధిలోని రెవెన్యూ బోర్డు కాలనీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఆయూష్) సంస్థ కార్యాలయ ఆవరణలో ధన్వంతరి జయంతిని పురస్కరించుకుని ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 7వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రతి ఇంట్లో- ప్రతి రోజు’ ఆయుర్వేదం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అందులో భాగంగా ఆరువారాల పాటు క్షేత్రస్థాయిలో పలు కార్యక్రమాలను నిర్వహించామని పేర్కొన్నారు. అంతకు ముందు ఉదయం ధన్వంతరి మహారాజ్ విగ్రహానికి పూజా, హోమం, ఆయుర్వేదంపై అవగాహన, ఆయుర్వేద ఫుడ్ ఫెస్టివల్, వన మూలికల ప్రదర్శన, ఔషద మొక్కల పంపిణీ, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి.సాకేత్రాం డాక్టర్ అశ్వక్ అహ్మద్, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ బిస్వా రంజన్దాస్, లైబ్రేరియన్ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.