శేరిలింగంపల్లి, ఆక్టోబర్ 23 : భర్తతో పాటు సినిమాకు వెళ్లిన భార్య అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, హత్నూర్ మండలం, చందాపూర్ గ్రామానికి చెందిన ఎం.భాస్కర్‌రెడ్డి ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 21న భాస్కర్‌రెడ్డి భార్య శైలజతో కలిసి సాయంత్రం కొత్తగూడలోని శరత్‌సిటీ ఏఎంబీమాల్లో సినిమాకు వెళ్లాడు. 5 గంటల సమయంలో భార్య శైలజ(27) వాష్‌రూమ్‌కి వెళ్లివస్తానని చెప్పి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. సినిమా హాల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆమె అచూకీ కోసం భర్త భాస్కర్‌రెడ్డి గాలించినా ఫలితం లేదు. దీంతో ఆదివారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య శైలజతో మే 26వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మాల్ సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.