మన్సూరాబాద్, అక్టోబర్ 21: గొల్ల, కురుమలకు బీజేపీ అన్యాయం చేసిందని, ఆ పార్టీకి చెందిన నాయకులు ఓట్లు అడిగేందుకు గ్రామాలకు వస్తే తరిమికొట్టాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా శుక్రవారం చింతపల్లి మండలం, మాల్లో ఆయన విస్త్రతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బాలరాజ్ యాదవ్ మాట్లాడుతూ… ప్రభుత్వం గొర్రెల పంపిణీని రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టలేదని… గొల్ల, కురుమల అభివృద్ధికి సీఎం కేసీఆర్ 2017 లోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
మునుగోడులో ఉప ఎన్నిక కోసమే గొర్రెల పంపిణీ చేపట్టారని బీజేపీ నాయకులు గొల్ల కురుమలకు బ్యాంకులో జమ కావల్సిన డబ్బులను ఎన్నికల కమిషన్‌కు చెప్పి నిలుపుదల చేయించారన్నారు. గొల్ల, కురుమల నోటికాడి కూడును ఆపించిన బీజేపీకి మునుగోడు ఉప ఎన్నికలో గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. 18 వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని తన స్వార్థ ప్రయోజనాలకు తాకట్టు పెడతాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో చందంపేట మాజీ ఎంపీపీ సర్వయ్య యాదవ్, నాయకులు అయోధ్య యాదయ్య, ఐలయ్య యాదవ్, గుండెబోయన వెంకటేశ్ యాదవ్, ఏడుకొండల్ యాదవ్, మల్లేశ్ యాదవ్, ప్రశాంతి యాదవ్, నర్సింహ యాదవ్ పాల్గొన్నారు.