సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మాత్రం ప్రజారక్షణ, శాంతి పరిరక్షణ కోసం నిరంతరం పాటుపడుతుంటారని, విధి నిర్వహణలో అసువులు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకోవాలని పలువురు అధికారులు సూచించారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఆయా కార్యక్రమాలకు పోలీస్ కమిషనర్లు మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర హాజరై, అమరులైన పోలీసులకు ఘన నివాళులర్పించారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో అమరవీరుల స్మారక స్థూపానికి సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు నివాళులర్పించారు. అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఆమన్‌గల్ ఎస్సై కె.హనుమంత్‌రెడ్డి, తలకొండపల్లి పోలీస్ కానిస్టేబుల్ ఫహీముద్దీన్, ఆర్ముడ్ కానిస్టేబుల్ ఈశ్వర్రావు సేవలను స్మరిస్తూ వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పోలీసులు ఫణంగా పెడుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ అవినాశ్ మహంతి, డీసీపీలు శ్రీనివాస్‌రావు, శిల్పవల్లి, జగదీశ్వర్‌రెడ్డి, కవిత తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్, అక్టోబర్ 21: దేశం కోసం ప్రాణాలర్పించిన సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మరిచిపోదని సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ మహేశ్ చంద్ లడ్డా అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్ కేంద్ర కార్యాలయంలో 1959 అక్టోబర్ 21న చైనా సరిహద్దులో ప్రాణాలర్పించిన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులర్పించిన అనంతరం ఐజీ మహేశ్ చంద్ లడ్డా మాట్లాడుతూ..అనేక సవాళ్లను ఎదుర్కొంటూ దేశ రక్షణలో పాలుపంచుకుంటున్న సీఆర్పీఎఫ్ జవాన్ల సేవలు ఎనలేనివన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ డీఐజీలు సజ్జానుద్దీన్, రాజ్‌కుమార్, జగ్ మోహన్ భగత్, కమాండెట్లు రాజ్ ముకుట్ కర్కేట్టా, సునీత్ వర్ష్నే పాల్గొన్నారు.
అంబర్‌పేటలోని కార్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో అమర వీరుల స్థూపానికి సీపీ మహేశ్ భగవత్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఈ ఏడాది 264 మంది పోలీసులు (ఆగస్టు 31వ తేదీ వరకు), అందులో రాచకొండ పరిధిలో 16 మంది పోలీసులు విధి నిర్వహణలో మృతి చెందారని తెలిపారు. పోలీసు సంక్షేమం కోసం వైద్య శిబిరాలు, కొవిడ్ వ్యాక్సినేషన్, ఫ్యామిలీ హెల్త్ చెకప్.. తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాచకొండ పోలీసులు నిర్వహించిన రక్తదాన శిబిరానికి హయ్యస్ట్ బ్లడ్ డొనేషన్ అవార్డు -2022 దక్కిందని పేర్కొన్నారు. అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు పోలీస్ ఫ్లాగ్ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందులో విద్యార్థులకు, సామాన్య పౌరులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసుల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిని సీపీ సన్మానించారు. ఈ సమావేశంలో డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్, రక్షితమూర్తి, సలీమా, అదనపు డీసీపీ నర్మద, షమీర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ పోలీసులు, ఉస్మానియా వైద్యశాల, డీఎంహెచ్ఓ సంయుక్తాధ్వర్యంలో గోషామహల్‌లోని పోలీస్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నగర అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్ ప్రారంభించారు. దాతల నుంచి 100 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ కార్తికేయ, డీసీపీలు జోయెల్ డేవీస్, బాపూరావు తదితరులు పాల్గొన్నారు.