అంబర్‌పేట, అక్టోబర్ 21 : అంబర్‌పేట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న పురాతన డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. నల్లకుంట డివిజన్లోని సత్యానగర్‌లో రూ.5.50లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న డ్రైనేజీ పైపులైన్ పనులను డివిజన్ కార్పొరేటర్ వై.అమృతతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట డివిజన్ల పరిధిలో ఉన్న అన్ని బస్తీలు, కాలనీల్లో ఇప్పటికే ఉన్న డ్రైనేజీ పైఫులైన్లను ఆధునీకరించినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మొదట డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు పూనుకున్నట్లు పేర్కొన్నారు. జలమండలి ఎండీని కలిసి ప్రత్యేకంగా నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు.
చాలా బస్తీలలో మంచినీరు, డ్రైనేజీ పైపులను మార్చినట్లు చెప్పారు. అలాగే ఎక్కడైతే కలుషిత మంచినీరు సరఫరా అవుతున్నదో అక్కడ వెంటనే పైపులైన్ వ్యవస్థను మారుస్తున్నామన్నారు. జ నాభా పెరగడంతో వారి అవసరాలకు అనుగుణంగా బస్తీలలో పైపులైన్ వ్యవస్థను రూపొందిస్తున్నామని వెల్లడించారు. పాదయాత్రలు, పర్యటనలు చేస్తున్న సమయంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారి సమస్యలను పరిష్కరిస్తున్నానని వివరించారు. ఎక్కడ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం శ్రీధర్‌రెడ్డి, సత్యానగర్ బస్తీవాసులు రాంచందర్, భిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు బి.లింగంగౌడ్, మిర్యాల రవీందర్, బుచ్చిరెడ్డి, నవీన్‌యాదవ్, బీజేపీ నాయకులు శ్యాంరాజ్, ఈశ్వర్, పి.మహేశ్, ధర్మేందర్, క్రాంతి, కిశోర్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.