తెలుగు యూనివర్సిటీ, అక్టోబర్ 21 : నాటక కళ, కళాకారులను పరిరక్షించుకుని భావితరాలకు మన సంస్కృతి ఉన్నతిని చాటాలని సమాజానికి వక్తలు సూచించారు. తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఆడిటోరియంలో తెలంగాణ తొలి మాండలిక నాటక రచయిత కోదాటి లక్ష్మీనర్సింహారావు జయంతి సందర్భంగా కె.ఎల్ స్మారక నాటకోత్సవాలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, సాంస్కృతికబంధు సారిపల్లి కొండలరావు, టి.టి.ఆర్.టి అధ్యక్షులు డాక్టర్ కె.విజయకుమార్, తెలుగువర్సిటీ రంగస్థల కళలశాఖాధిపతి డాక్టర్ కె. హనుమంతరావు, అన్నమాచార్య సంకీర్తనా ప్రచార సమితి అధ్యక్షులు డాక్టర్ ఎమ్.పురుషోత్తమాచార్య, యువ కళావాహిని అధ్యక్షులు లంకా లక్ష్మీనారాయణ, కోదాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
కె.ఎల్ నర్సింహారావు పేరిట నాటకోత్సవాలు జరుపడం అభినందనీయమని రమణాచారి అన్నారు. కె.ఎల్. రచనలలోని నాటికల గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పి.వి.నరసింహారావు సైతం ఆయన నాటికలను వీక్షించి ప్రశంసించారని రమణాచారి గుర్తు చేశారు.
వచ్చే ఏడాది కె.ఎల్.శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకునేలా ప్రణాళిక రచించాలని సూచించారు. అనంతరం కోమలి కళాసమితి నల్లగొండ ఆధ్వర్యంలో తులసీ బాలకృష్ణ రచన డాక్టర్ గోవాడ వెంకట్ దర్శకత్వంలో ‘ అన్నట్టు మనం మనషుల కదూ ’ నాటికను వేదికపై ప్రదర్శించారు. శనివారం సుమిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కె.ఎల్.నరసింహారావు రచన, ఎన్.సుబ్బారావు దర్శకత్వంలో ‘తొలకరి నాటిక ’ ప్రదర్శన ఉంటుందని తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు రాంచందర్రావు తెలిపారు.