మేడ్చల్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో శుక్రవారం వానాకాలం 2022-23 ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన మంత్రి మల్లారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు, దీనికి గాను జిల్లాలో 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదును జమ చేస్తుందన్నారు. రైతులు పండించిన చివరి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రస్తుత సీజన్లో 45 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని, ఎంత మేరకు ధాన్యం వచ్చినా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఏ-గ్రేడ్ రకానికి రూ.2.060, సాధారణ రకానికి రూ.2.040 మద్దతు ధరను ప్రకటించిందన్నారు.
కొనుగోళ్లలో రైతులకు అధికారులు పూర్తిగా సహకరించి ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలన్నారు. నిధుల కొరత ఏ మాత్రం లేదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా ఉందని, ధాన్యం కొనుగోళ్లల్లో సైతం నంబర్‌వన్ స్థానంలో ఉంచాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ధాన్యానికి సంబంధించిన మద్దతు ధర కరపత్రాన్ని మంత్రి మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, కలెక్టర్ హరీశ్ ఆవిష్కరించారు. సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, జిల్లా అధికారులు రాజేందర్, శ్రీనివాసమూర్తి, మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, ఆర్డీవో రవి, రైస్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని – జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ధాన్యం రవాణా విషయంలో రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, ఈ విషయంలో మార్కెటింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ హరీశ్ కోరారు. రైతులు పండించిన వ్యవసాయ క్ష్రేతాల నుంచి ధాన్యాన్ని తీసుకువచ్చేందుకు గోనే సంచులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రైతులకు సంబంధించిన ధాన్యాన్ని వరుస క్రమంలో కొనుగోళ్లు చేయాలని, ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.