వనస్థలిపురం, అక్టోబర్ 21 : వనస్థలిపురం ఫేజ్-4లో నిర్మించిన స్విమ్మింగ్ పూల్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మూడు స్విమ్మింగ్ పూళ్లను నిర్మిస్తున్నామన్నారు. బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లో ఇప్పటికే అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. హస్తినాపురంలో నిర్మాణం దశలో ఉందని, వనస్థలిపురంలో త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే ఎన్నో పార్కులను అభివృద్ధి చేశామన్నారు. పార్కులు, స్విమ్మింగ్ పూళ్లు మానసిక, శారీరక ఆహ్లాదాన్ని కలిగిస్తాయన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ నాయకులు పోగుల రాంబాబు, సంజయ్‌కుమార్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.