బంజారాహిల్స్,అక్టోబర్ 21:జీహెచ్ఎంసీ సర్కిల్ -18 పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం ముమ్మురంగా సాగుతోంది. సర్కిల్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్‌పేట డివిజన్ల పరిధిలోని సుమారు 14 వేల దరఖాస్తులు డబుల్ బెడ్రూమ్ల కోసం వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.
అయితే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నవారిలో చాలామంది అసంపూర్తి వివరాలు అందించారు. అలాంటి వారు పూర్తి స్థాయి వివరాలు అందించేందుకు ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తుల్లో చాలామంది కేవలం ఆధార్ కార్డు నెంబర్ మాత్రమే ఇచ్చారు. దరఖాస్తుతో పాటు ఓటర్ ఐడీ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్, చిరునామా లేకపోవడంతో పరిశీలనకు వచ్చే అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తులు చేసుకున్న సమయంలో చిరునామాలో చాలామంది లేకపోవడంతో వారినుంచి పూర్తి వివరాలు తీసుకోలేకపోతున్నారు.
దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో దరఖాస్తు చేసుకున్న వారు నేరుగా సర్కిల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌కు వస్తే అక్కడికక్కడే ఆన్లైన్లో వివరాలను అప్డేట్ చేస్తున్నారు. దరఖాస్తుదారులంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సర్కిల్ 18 డీఎంసీ రజినీకాంత్‌రెడ్డి సూచించారు.