సికింద్రాబాద్, అక్టోబర్ 21: పేదలు కార్పొరేట్ వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. శుక్రవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో ఇద్దరికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీలను లబ్ధిదారు కుటుంబసభ్యులకు అందజేశారు. రసూల్‌పురాకు చెందిన ఇంతియాజ్‌కు మోచేతి శస్త్ర చికిత్సకు అవసరమైన రూ.1లక్ష, సిఖ్‌విలేజ్ గాంధీనగర్‌కు చెందిన పోచయ్యకు మెదడు సంబంధిత వ్యాధి చికిత్స కోసం సుమారు రూ.2.50లక్షల విలువజేసే ఎల్వోసీలను సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరుకాగా వాటిని లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద కార్పొరేట్ ఆసుపత్రులలో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తుందన్నారు. అదే విధంగా ఆరోగ్య శ్రీ పథకంలో లేని వ్యాధులకు జరిగిన చికిత్స కోసం కూడా సీఎం పేదలకు అండగా ఉండాలన్న సంకల్పంతో ఆర్థిక సహాయం అందజేస్తున్నారని వైద్య ఖర్చులకు సహాయ సహకారాలు అందజేస్తూ పేదల పెన్నిదిగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా నాయకురాలు నివేదితతో పాటు పలువురు నేతలు తదితరులు పాల్గొన్నారు.