సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): చిరు వ్యాపారుల ఇబ్బందులను తొలగించి తమ వ్యాపార నిర్వహణ సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. వీధి వ్యాపారుల జీవన పరిస్థితిని మెరుగు పర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని వారికి అందజేసి ఆదుకున్నామని పేర్కొన్నారు. చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించే ఉద్దేశంతో హైదరాబాద్ మహానగరంలో సర్వే చేయగా లక్షా 63 వేల 073 మందిని గుర్తించినట్లు అధికారులు వివరించారు. వీరిలో లక్షా 62వేల 800 మందికి జీహెచ్ఎంసీ గుర్తింపు కార్డులను జారీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా 20 పట్టణ వీధి వ్యాపారుల కమిటీలను ఏర్పాటు చేశామని, దాంతో పాటుగా 584 కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు వివరాలను వెల్లడించారు. ప్రధాన మంత్రి స్వానిధి పథకం ద్వారా వ్యాపార అభివృద్ధి చేసుకునేందుకు 67,166 మందికి రూ.80.41 కోట్లు మంజూరు కాగా అందులో ఇప్పటి వరకు 62.96 కోట్ల రూపాయలను 55, 619 మంది వీధి వ్యాపారులకు అందించామన్నారు.
సీనియర్ సిటిజన్లకు ఆసరా..
సీనియర్ సిటిజన్లకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 763 సీనియర్ సిటిజన్లకు గుర్తింపు కార్డులను జారీ చేశామని వెల్లడించారు. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా 103 డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేయగా.. అందులో 30 కేర్ సెంటర్లలో ఫిజియోథెరపీ పరికరాలను రాష్ట్ర వైద్య,ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా సమాకూర్చామని తెలిపారు. దీంతో పాటుగా మహిళ, శిశు సంక్షేమ శాఖ సహకారంతో అవసరమైన సహాయ పరికరాలను సీనియర్ సిటీజన్లకు అందిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.