సిటీబ్యూరో/మేడ్చల్/ బడంగ్‌పేట, అక్టోబర్ 20:(నమస్తే తెలంగాణ): కొన్నేళ్ల తర్వాత ప్రభుత్వ కొలువుల ప్రకటనతో గ్రంథాలయాలు ఉద్యోగార్థులతో కిటకిటలాడుతున్నాయి. 80వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా అభ్యర్థులు స్వీయ శిక్షణతో పాటు గ్రంథాలయాల బాట పట్టి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మెటీరియల్ సమకూర్చుకుంటున్నారు. లైబ్రరీలు అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం గ్రంథాలయాలకు పూర్వవైభవం కల్పించడంలో భాగంగా రూ.17కోట్లతో ఆధునీకరించింది. సకల సదుపాయాలు ఒనగూరిన తరుణంలో పాఠకుల నుంచి గ్రంథాలయాలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. ఇటీవల ప్రభుత్వం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచడంతో నిరుద్యోగులకు వరంగా మారింది. గ్రంథాలయానికి వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక హాల్స్, తాగునీటి వసతి, టాయిలెట్స్ వంటి సదుపాయాలను గ్రంథాలయాధికారులు సమకూరుస్తున్నారు. 12 గ్రంథాలయాలకు నూతన భవన కల్పనలో భాగంగా చేపట్టిన నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. చాలాచోట్ల విద్యార్థులకు, సీనియర్ సిటిజన్స్‌కు, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా హాల్స్‌ను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గ్రంథాలయాల ప్రాంగణాల్లో ఏర్పాటుచేసిన ‘అన్నపూర్ణ’ క్యాంటీన్ల ద్వారా రూ.5 కే భోజనం అందించడం కూడా నిరుద్యోగార్థులకు ప్రయోజనకంగా ఉంటున్నది.
పెరుగుతున్న ఆదరణ
ప్రభుత్వ నోటిఫికేషన్లు రాకముందు చిక్కడపల్లిలోని గ్రంథాలయానికి వచ్చేవారి సంఖ్య 500కంటే ఎక్కువగా ఉండేది కాదు. నోటిఫికేషన్ల అనంతరం ఆ సంఖ్య రెండు వేల వరకు పెరిగింది. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా హాల్స్ అందుబాటులోకి రాగా..ఆడిటోరియం, గ్రంథాలయం ప్రాంగణంలోనూ నిరుద్యోగార్థులు కూర్చుని చదువుకుంటున్నారు. ఇక్కడ ‘అన్నపూర్ణ’ క్యాంటీన్ ద్వారా రూ.5 కే భోజనం అందిస్తున్నారు.
బడంగ్‌పేట్‌లోని జిల్లా గ్రంథాలయంలో వివిధ విభాగాల వారీగా ప్రత్యేక హాల్స్‌ను ఏర్పాటు చేశారు. మొదటి అంతస్థులో కాన్ఫరెన్స్ హాల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవల రూ.10లక్షలు వెచ్చించి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ఉపయోగపడే పుస్తకాలను సమకూర్చారు. ప్రిపరేషన్‌కు అనుకూల పరిస్థితులు ఉండటంతో ప్రస్తుతం 200మందికి పైగానే పాఠకులు ఇక్కడికి వస్తున్నారు.
అఫ్జల్‌గంజ్ గ్రంథాలయానికి ప్రస్తుతం 500 మంది పాఠకులు వస్తున్నారు. వారికి రూ.5కే అన్నపూర్ణ భోజనం అందిస్తున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల్లో పాఠకుల సంఖ్య 2, 21,806 వరకు చేరింది. గత సంవత్సరం పాఠకుల సంఖ్య 1,70,620 ఉండేది. ప్రస్తుతం గ్రంథాలయాల్లో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచడంతో గ్రంథాలయాలకు యువతి, యువకులు క్యూకడుతున్నారు.
పక్కా భవనాలకు ప్రతిపాదనలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాలకు పక్కా భవనాలు నిర్మించాలని గ్రంథాలయాల సంస్థ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మేడ్చల్, ఉప్పల్, శామీర్‌పేట్, ఘట్కేసర్లో ఇప్పటికే ఉండగా కీసర, దేవరయాంజల్, ఫతేనగర్, కూకట్‌పల్లిలో పక్కా భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకుగాను రూ.3 కోట్ల 35 లక్షల ప్రతిపాదనలు పంపించాం.
– సురేశ్, జిల్లా గ్రంథాలయ ఇన్చార్జి కార్యదర్శి, మేడ్చల్
త్వరలోనే డిజిటల్ గ్రంథాలయాలు
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలకు గ్రంథాలయ సేవలను విస్తరింప చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచనల మేరకు ఇప్పటికే కోట్ల రూపాయలు వెచ్చించి నూతన భవనాలు ఏర్పాటు చేయించాం. త్వరలోనే డిజిటల్ గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేయబోతున్నాం.
-కప్పాటి పాండు రంగారెడ్డి, గ్రంథాలయ శాఖ చైర్మన్, రంగారెడ్డి
భోజనం, నీటి వసతి బాగుంది
గ్రూప్స్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకునేందుకు నిర్మల్ నుంచి వచ్చిన. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే వారికి చిక్కడపల్లిలోని గ్రంథాలయం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ప్రశాంత వాతావరణంలో చదువుకునేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలను ఇక్కడ కల్పించారు. దీనికితోడు జీహెచ్ఎంసీ ద్వారా అందిస్తున్న రూ.5 కే భోజనం, మంచినీటి వంటి వసతులు సైతం లైబ్రరీకి వచ్చే వారికి ప్రయోజనకరంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది.
– ప్రశాంత్
గ్రంథాలయాల్లో సలక వసతులు కల్పించారు
సీఎం కేసీఆర్ ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న తమలాంటి వారికి ఇది తీపి కబురే. సీఎం కేసీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. తాము పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కావాల్సిన అన్ని వసతులను గ్రంథాలయం అధికారులు సమకూర్చడం అభినందనీయం.
– ఎం.వినోద్, అభ్యర్థి
పొద్దంతా లైబ్రరీలోనే..
పోటీ పరీక్షలకు అవసరమైన అన్నిరకాల బుక్స్‌ను గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఉద్యోగార్థులు పొద్దంతా పుస్తకాలతో కుస్తీ పడుతూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగ నోటిఫికేషన్‌ను ప్రకటించిన సీఎం కేసీఆర్ స్థానికులకే 95శాతం అని చెప్పడం హర్షించదగిన విషయం.
-కె సురేంద్ర, అభ్యర్థి