గ్లోబల్ సిటీ హైదరాబాద్‌లో చౌరస్తాలు కొత్త రంగు పులుముకుంటున్నాయి. ఎల్ఈడీ, కలర్ లైటింగ్‌లో జిగేలుమంటున్నాయి. ప్రధాన జంక్షన్లు, ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్‌లను ఆధునీకీకరించడంతోపాటు గ్రీనరీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రధానంగా వెస్ట్ సిటీలోని ప్రధాన జంక్షన్ల డెవలప్మెంట్ వాహనదారులతోపాటు నగరానికి వచ్చే పర్యాటకులను నివ్వెరపోయేలా చేస్తోంది.
ప్రధాన జంక్షన్లను ఆధునీకరించాలనే లక్ష్యంతో గ్రీనరీ, లైటింగ్‌తో పాటు జీవకళ ఉట్టిపడే కళాకృతులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఏడాది కాలంగా సిటీలోని ప్రధాన జంక్షన్లు ముఖ్యంగా వెస్ట్ సిటీ, ఓఆర్ఆర్ వెంబడి ఉన్న ఇంటర్ చేంజ్‌లను అభివృద్ధి చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు సాధారణంగా కనిపించే చౌరస్తాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. దీంతోపాటు వాహనదారులకు కనువిందు చేస్తున్నాయి.
ఆకట్టుకునేలా జంక్షన్ల బ్యూటిఫికేషన్
చౌరస్తాలు, ప్రధాన జంక్షన్ల బ్యూటిఫికేషన్ కొంత కాలంగా సాగుతోంది. ఓఆర్ఆర్ వెంబడి ఉన్న 19 టోల్ గేట్లు, ఇంటర్ చేంజెస్తోపాటు ఐటీ కారిడార్‌లోని నానక్ రాంగూడ, గచ్చిబౌలి, కోకాపేట వంటి ప్రధాన జంక్షన్లను అభివృద్ధి చేశారు. థిమాటిక్ ఓరియేంటేషన్లో రూపొందించిన కళాకృతులకు చూడటానికి ఎంతగానో ఆకట్టుకోవడంతోపాటు ప్రయాణికులకు నైట్ వ్యూ ఇబ్బందులు లేకుండా ఉపయోగపడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల నానక్ రాంగూడలోని గ్రోత్ కారిడార్ విభాగం ఏర్పాటు చేసిన లోహ మనిషి రూపం అటు వైపు కొత్తగా వెళ్లినవారిని ఆశ్చర్యపడేలా చేయగా, సోషల్ మీడియాలోనూ నైట్ విజన్ ఆకృతి చూడముచ్చటగా ఉందని నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సింబాలిక్ ఆకృతులు.. ఆకట్టుకునే నైట్ వ్యూ
జంక్షన్లు, ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన ఆకృతులన్నీ థీమ్ ఓరియెంటేడ్గానే రూపొందిస్తున్నారు. అప్పా జంక్షన్ నుంచి శంషాబాద్ వెళ్లే మార్గంలో పక్షులు ఎగురుతున్న బొమ్మలతో… శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు వెళ్తున్న వలస పక్షులను ఏర్పాటు చేశారు. ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాన్ని ప్రతిబింబించేలా బుల్ విగ్రహంతోపాటు డాలర్, రూపీ, విదేశీ కరెన్సీ బొమ్మలతో అభివృద్ధి చేశారు. సుదూర ప్రాంతాల నుంచి నగరంలోని అమీన్పూర్ లేక్ కు వచ్చే పెలికాన్ పక్షులను పరిరక్షించుకోవాలనే థీమ్‌తో పటాన్చెరు ఇంటర్ చేంజ్ వద్ద ఏర్పాటు చేసిన పెలికాన్ బొమ్మలు నైట్ వ్యూలోనే కాకుండా డే టైంలోనూ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక ఓఆర్ఆర్పై జరిగిన ల్యాండ్ స్కేప్ డెవలప్మెంట్ పనులతో ఓరుగల్లు కళాతోరణం, పర్యావరణం పరిరక్షించుకోవాలని సూచించే అరచేతిలో మొక్కలు ఇలా వివిధ కళాకృతులలో జంక్షన్లను అభివృద్ధి చేసి ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు.
కొత్తగా ల్యాండ్‌స్కేపింగ్ విభాగం..
హెచ్ఎండీఏలో ఉన్న ఇంజినీరింగ్, అర్బన్ ఫారెస్ట్రీ విభాగాలతో పాటు కొత్తగా ల్యాండ్ స్కేపింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీనికోసం ప్రత్యేక కార్యాలయాన్ని నానక్‌రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. దేశ, విదేశాల్లో పేరొందిన ల్యాండ్‌స్కేపింగ్ నిపుణుల నుంచి ఆయా ప్రాంతాల వారిగా విభిన్న డిజైనింగ్ రూపొందించి ఎంపిక చేస్తున్నారు. ల్యాండ్ స్కేపింగ్ డిజైన్ల ఎంపికను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ,హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్‌లు స్వయంగా పరిశీలించిన తర్వాతే ఎంపిక చేయటం విశేషం.