సిటీబ్యూరో, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : మహానగరంలో నిర్మాణ రంగం రూటు మారింది. పశ్చిమానే కేంద్రీకృతమైన భారీ భవన నిర్మాణ ప్రాజెక్టులు కోర్ సిటీలోనూ విస్తరిస్తున్నాయి. నగరం నడిబొడ్డున అబిడ్స్‌లో సరికొత్త గేటెడ్ కమ్యూనిటీ అద్భుతంగా ఆవిష్కృతమవుతున్నది. దాదాపు ఎకరన్నర స్థలంలో 40 అంతస్తులతో భారీ భవన నిర్మాణానికి మీనాక్షీ సంస్థ శ్రీకారం చుట్టింది. 134 మీటర్ల ఎత్తులో 132 యూనిట్లతో ‘మీనాక్షి ఎల్సియా’ పేరిట చేపట్టబోయే భారీ టవర్స్‌కు జీహెచ్ఎంసీ ఇటీవల అనుమతి ఇచ్చింది.
2028 సంవత్సరం నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు మీనాక్షి సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర సచివాలయంతో పాటు బిర్లా మందిరం, ఎలీ స్టేడియం, అసెంబ్లీ, చార్మినార్, హుస్సేన్‌సాగర్ లాంటి చారిత్రక అందాలను అస్వాదించేలా ప్రత్యేకతలతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నది. కాగా కోర్ సిటీలో ఇప్పటి వరకు సోమాజిగూడ వన్ హైదరాబాద్ పేరిట ప్రణవ గ్రూప్ 24 అంతస్తులతో నిర్మాణం, ది పార్క్ హోటల్ సమీపంలో ‘బ్లిస్’ కంపెనీ 17 అంతస్తులతో నిర్మాణం భారీ భవనంగా నిలువగా.. తాజాగా 40 అంతస్తుల ఈ భారీ భవనం పాతనగరంలో అత్యంత ఎత్తయిన నిర్మాణంగా నిలువనున్నది.
హైదరాబాద్ సిగలో తమకంటూ ప్రత్యేక ముద్ర
హైదరాబాద్ నిర్మాణ రంగం సరికొత్త పుంతలు తొక్కుతున్నది. భాగ్యనగరంలోని నివాసితులకు సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా నిర్మాణ రంగ సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నారు. స్థలం దొరికితే అపార్ట్మెంట్ కట్టేశామా? అమ్మేశామా? కాకుండా హైదరాబాద్ సిగలో తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకునేలా నిర్మాణాలు చేపడుతున్నారు.
ప్రజలకు అన్ని విధాల నచ్చి.. ఉపయోగపడే థీమ్‌ను ఎంచుకుంటున్నారు. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా నిర్మాణ పోకడలను అధ్యయనం చేసి నిపుణులతో చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. థీమ్ ఆథారిత ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే నగరం నడిబొడ్డున నుంచి నగర అందాలను వీక్షించేలా అకాశమంత భారీ భవనాన్ని మీనాక్ష్మీ సంస్థ అబిడ్స్ ఎస్బీఐ కేంద్ర కార్యాలయంలో ఎదురుగా నిర్మిస్తున్నది. అత్యంత విశాలమైన స్థలంలో మొత్తం నాలుగు బెడ్ర్రూంలతో కూడిన ప్రాజెక్టు చేపడుతున్నారు. ఒక్కో ఫ్లోర్లో నాలుగు యూనిట్లు మాత్రమే ఉంటాయి. ఒక్కో ఫ్లాట్ సైజు 4110 నుంచి 4446 వరకు ఉంటుంది. ఈ సైజుతో కూడిన ఫ్లాట్ సైజు మొట్టమొదటి సారిగా ఈ ప్రాంతంలో వస్తుంది. నేటి ఆధునిక నిర్మాణ శైలిని పునికిపుచ్చుకుని కోర్ సిటీ అందాలను ఫ్లాట్ నుంచే వీక్షించేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు.