మన్సూరాబాద్, అక్టోబర్ 17: పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం అందిస్తున్న భోజనంలో నాణ్యత పాటించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు కొంతం గోవర్ధన్ రెడ్డి, మూలకుంట్ల భారతి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ ప్రెస్కాలనీ సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో సోమవారం ఫుడ్ కమిషన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మన్నను సంస్థ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఉడికి, ఉడకని భోజనాన్ని వడ్డిస్తున్నారని, ఉడకపెట్టి ఇచ్చే కోడిగుడ్లు దుర్వాసన వస్తున్నాయని విద్యార్థులు ఫుడ్ కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. విద్యార్థుల భోజనాల కోసం ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుందని.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం సరఫరా చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న మన్నను సంస్థపై చర్యలు తీసుకోవాలని వారు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విద్యావతి తదితరులు పాల్గొన్నారు.